
నెల్లూరు మహిళా చైతన్యం నెల్లూరుజిల్లా మహిళలు పలురంగాలలో చైతన్య వంతులుగా నిలిచారు. 1930 ప్రాంతాల నుండి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు, సమాజసేవలో తరించారు. స్త్రీ విద్యకు, స్త్రీ జనోద్ధరణకు, ఖద్దరు వస్త్రధారణకు, విదేశీ వస్తు బహిష్కరణకు ఉద్యమించారు. ఆనాటి నుండి నేటి వరకు మహిళా చైతన్యం వెల్లివిరుస్తుంది. బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని వవ్వేరు గ్రామ పంచాయితీకి మొత్తం తొమ్మండుగురు మహిళలు, సర్పంచిగా వవ్వేరు విమలమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956లో ఇది జరగడం విశేషం. ఇక్కడ మహిళల్లో అంత చైతన్యం వచ్చింది. ఇది జిల్లాలో సంచలనం కలిగించింది. రాష్ట్ర నాయకుల దృష్టికి వెళ్ళింది. ఆనాడు ఆంగ్ల పత్రికలలో సైతం ఈ సమాచారం ప్రముఖంగా ప్రచురించారు. సారా వ్యతిరేకోద్యమం – శంఖం పూరించిన రోశమ్మ నెల్లూరు మహిళా చైతన్యానికిది నిలువెత్తు సాక్ష్యం. మహిళల కడుపు మంటతో ప్రారంభ మైనదీ వుద్యమం. ధన, మాన, ప్రాణాలను హరించే మద్యపానం అనర్థమని గుర్తించిన నెల్లూరుసీమ మహిళలు ఉవ్వెత్తున లేచారు. కుటుంబ బాధ్యతలు చేపట్టాల్సిన పురుషులు సారామత్తులో జోగుతూ భార్యాబిడ్డలను, వృద్ధులైన తల్లిదండ్రులను కష్టాలు పాలు చేయడం సహించలేక ఉద్యమబాట పట్టారు. జిల్లాలో కలిగిరి మండలంలోని తూర్పుదూబగుంట గ్రామానికి చెందిన ఒక సాధారణ మహిళ వర్ధినేని రోశమ్మ ఉద్యమాన్ని 1991లో ప్రారంభించారు. ఆమె వేసిన బీజం మండల స్థాయిలో చిన్న ఉద్యమంగా ప్రారంభమై 1992లో జిల్లా మొత్తానికి పాకింది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమమైంది. ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపింది. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు మద్దతిచ్చాయి. సారా వ్యతిరేకోద్యమ నాయకులంతా ఒక పోరాటసమితిగా ఏర్పడ్డారు. సారా వేలం పాటలు అడ్డుకోవడం, అంగళ్లపై దాడులు, సారా పొట్లాలు దహనం చేయడం జరిగింది. ఉద్యమం తీవ్రమైంది. 1992 చివరనాటికి జిల్లాలోని శాసనసభ్యులందరు మద్దతు ఇచ్చారు. ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి జనార్థన్‌రెడ్డి ఆలోచనలో పడ్డారు. ఒక వైపు వేలం పాటలు దక్కించుకొన్న సారాయి కాంట్రాక్టర్ల వత్తిడి, మరోవైపు ప్రజా ఉద్యమం, ఇంకోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందన్న ఆందోళనతో ఏ నిర్ణయానికి రాలేక పోయారు. ఇంతలో ముఖ్యమంత్రి మారారు. విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం వచ్చింది. 1993లో సారా నిషేధ ఉత్తరువులు జారీ చేసింది. మహిళా ఉద్యమం విజయం సాధించింది. నెల్లూరు జిల్లాలో ఏప్రెల్ నెలలో, రాష్ట్రం మొత్తానికి అక్టోబరు నెలలో నిషేధం విధించారు. నెల్లూరు జిల్లాలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. 1964 – 70లో రాజ్యసభకు ఎం.ఎల్. మేరినాయుడు ఎన్నికైనారు. పార్ల మెంటు సభ్యులుగా 91-96 వరకు కుడుముల పద్మశ్రీ (కాంగ్రెసు), 1996,1998,2004 ఎన్నికలలో పనబాక లక్ష్మి (కాంగ్రెసు), 1999-2004 వరకు ఉక్కాల రాజేశ్వరమ్మ (తెలుగుదేశం) ఎన్నికైనారు. వీరిలో పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా పనిచేశారు. వెంకటగిరి అసెంబ్లీ నుంచి రెండు సార్లు 1999, 2004లో ఎన్నికైన నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఐదేళ్లపాటు విద్యాశాఖ మంత్రిగా, మాతా, శిశు సంరక్షణశాఖ మంత్రిగా పదవుల నలంకరించారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి పదవి పొందిన జిల్లా తొలి మహిళగా గుర్తింపు పొందారు. మాగుంట పార్వతమ్మ ఒకసారి ఒంగోలు పార్లమెంటుస్థానానికి, ఒకసారి కావలి అసెంబ్లీ స్ధానానికి ఎన్నికైనారు. నెల్లూరు జిల్లా పరిషత్తు అధ్యక్ష పదవికి ఎం. నాగభూషణమ్మ ఎన్నికైనారు. నెల్లూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఒకసారి తాళ్లపాక అనూరాధ (తెలుగుదేశం), కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత పులిమి శైలజ(కాంగ్రెసు), ఆ తర్వాత నంది మండలం భానుశ్రీ(కాంగ్రెస్) మేయరు పదవుల నలంకరించారు. గూడూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కోడూరు కల్పలత పనిచేశారు. ఆ తర్వాత యారం మంజుల వచ్చారు. 2014లో పొణకా దేవసేన ఎన్నిక య్యారు. కావలి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పోతుగంటి అలేఖ్య ఎన్నికయ్యారు. నెల్లూరు నెరజాణ కథ చారిత్రకాధారంలేని ఒక కథ ప్రచారంలో వుంది. ఇందులో వాస్తవమెంతో తెలియదు గాని ఒకసారి కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి నెల్లూరు సీమలో మేనాలో ప్రయాణిస్తున్నాడు. ఎదురుగా వచ్చిన అందమైన గ్రామీణ యువతిని చూసి ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పాడు. చివరగా తనపేరు ‘శ్రీనాథు’డని, ‘స్త్రీ నాథు’డని భావగర్భితంగా, గూఢార్ధం ధ్వనించేటట్లుగా అన్నాడట. ఆమె తడుముకోకుండా ‘మీ అమ్మకు కూడానా’ అని వెనువెంటనే అన్నదట. రాజసభలలో కవి పండితులను తన వాక్పటిమతో ఓడించిన శ్రీనాథుడు క్షణకాలం పాటు అవాక్కయి నివ్వెరపోయి, తేరుకొని ‘నెల్లూరు నెరజాణ’ అంటూ వెళ్ళిపోయాడట. గ్రామీణ ప్రజలు ఇప్పటికి ఈ కథను చెప్పుకొంటారు. నెల్లూరు మహిళల సమయస్ఫూర్తికి, స్వాభిమానానికి, జాణతనానికి నిదర్శనంగా చెప్పుకోవాల్సిన విషయం. వీరపత్ని చానమ్మ 13వ శతాబ్ధిలో నెల్లూరునేలిన మనుమసిద్దికి, కనిగిరి సీమ రాజైన కాటమరాజుతో ‘పుల్లరి’ చెల్లించే కారణంగా యుద్దం వచ్చింది. యాదవులది పైచేయి కాగా తిరిగి వచ్చిన మనుమసిద్ది సైన్యాధిపతి ఖడ్గతిక్కనతో పౌరుషాగ్నిని రగిల్చి భార్య చానమ్మ కదనరంగానికి పంపింది. యుద్దంలో వీరమరణం పొందిన భర్తతోపాటు సహగమనం చేసింది. వీరనారిగా, వీరపత్నిగా చానమ్మ చరిత్రలో నిలిచిపోయింది. ఇదికూడా ప్రచారంలో వున్న ఒక గాధ.