శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 8 జూలై
నెల్లూరు వేదాయపాలెం లో నివాసం ఉంటున్న డా. పీర్ కుమార్ వరుసగా మూడవ సారి కవితా పోటీలో విజేతగ నిలిచారు. రాష్ట్రంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న వివిధ సాహిత్య సంస్థలు అయిన శ్రీ శ్రీ కళావేదిక, విశ్వసాహితీ కళావేదిక మరియు తెలుగు కళారత్నాలు మొదలైనవి నిర్వహిస్తున్న కవితా పోటీలలో పాల్గొని వరుసగా మూడోసారి టాప్ 20 లో డాక్టర్ బద్రి పీర్ కుమార్ విజేతగా నిలిచారు. గత నెల విశ్వసాహితీ కళావేదిక ‘కనిపించని గాయం’ అనే అంశంపై నిర్వహించిన కవిత పోటీలోను, తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహించిన ‘సంగీతమే ఊహల లోగిలి’ అనే అంశంలోను, ద్వితీయ విజేతగా నిలిచారు. అదేవిధంగా ఈనెల శ్రీ శ్రీ కళావేదిక “సంకల్పబలం” అనే అంశంపై నిర్వహించిన కవిత పోటీలో టాప్ 20 లో 6వ స్థానం దక్కించుకొని వరుసగా మూడోసారి విజేతగా నిలిచారు. వృత్తిరీత్యా అధ్యాపకుడిగా పనిచేస్తూనే ప్రవృత్తిగా నటన, రచనలో ప్రతిభ కనబరుస్తూ ఉండడంతో సంస్థ నిర్వాహకులు, కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు డాక్టర్ పీర్ కుమార్ ని అభినందిస్తున్నారు.



