ఆదివాసీ చట్టాలు, హక్కులను పకడ్బందీగా అమలు చేయాలి
నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నక విజయ్ కుమార్
జోడేఘాట్, ఆగస్టు 09:
అమరవీరుడు కొమురం భీం “జల్–జంగల్–జమీన్” నినాదంతో పోరాడి ప్రాణాలర్పించిన చారిత్రక జోడేఘాట్ గడ్డపై ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొమురం భీం మనువడు కుంరం సోనేరావు, తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నక విజయ్ కుమార్ హాజరయ్యారు.
వేడుకల్లో భాగంగా ముందుగా కొమురం భీం సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ హక్కులు, చట్టాల అమలు, గిరిజన గ్రామాల అభివృద్ధి తదితర అంశాలపై నాయకులు మాట్లాడారు.
ఐక్యరాజ్యసమితి గుర్తింపు.. ప్రభుత్వాల నిర్లక్ష్యం
ఆదివాసీల ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9ను ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం గర్వకారణమని తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నక విజయ్ కుమార్ అన్నారు. కొమురం భీం పోరాటం సాగించిన జోడేఘాట్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం మరింత ప్రాధాన్యత కలిగిందన్నారు.
అయితే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అనేక ఆదివాసీ గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, రహదారులు, ఉపాధి వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరారు.
ఆదివాసీలపై వేధింపులు ఆపాలి
అడవిని దేవతగా భావించి సంరక్షిస్తున్న ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల వేధింపులు, దాడులు ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను టైగర్ జోన్, టైగర్ కారిడార్ పేరుతో స్వాధీనం చేసుకుంటూ గిరిజనులను అడవులకు దూరం చేస్తున్నారని ఆరోపించారు.
1/70, PESA చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన 1/70 చట్టం, PESA చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలను పక్కనపెట్టి అక్రమ నిర్మాణాలకు, గిరిజనేతరుల ఆధిపత్యానికి అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు.
ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
కన్నులపండువగా సాంస్కృతిక ప్రదర్శనలు
సమావేశం అనంతరం నిర్వహించిన ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు, వాయిద్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పులు, సంప్రదాయ వాయిద్యాల మోతలతో జోడేఘాట్ ప్రాంగణం మార్మోగింది. ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువత సంప్రదాయ నృత్యాల్లో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ టైగర్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు కోట్నక కిషన్, ప్రధాన కార్యదర్శి పెందోర్ దర్ము, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతి, జిల్లా ముఖ్య సలహాదారు కనక ప్రభాకర్, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సెడ్మాకి తుకారాం, పోరు గ్రామాల యువజన సంఘం వ్యవస్థాపకుడు పెందోర్ రాజేశ్వర్, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోవ ఇందిరా, ఆదివాసీ టైగర్ సేనా జిల్లా ప్రధాన కార్యదర్శి మడవీ పురుషోత్తం, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావు, వెంకటేష్, జిల్లా కార్యదర్శి సిడం నాగేష్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఈశ్వర్, నాయకులు అడ సోమేష్, పోరు గ్రామాల పటేళ్లు, దేవారీలు, మహిళలు, యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




