సేవా కార్యక్రమంతో ఆదర్శంగా నిలిచిన సాల్మన్ రాజు–సరిత దంపతులు
ముఖ్యఅతిథిగా 2టౌన్ టౌన్ సిఐ బి అప్పలనాయుడు స్ఫూర్తినిచ్చే సందేశం
ఉత్తరాంధ్ర ప్రతినిధి ఆగస్టు 9 పున్నమి న్యూస్
భీమునగర్ షెల్టర్లో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులకు సాల్మన్ రాజు, సరిత దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివాహ వార్షికోత్సవాన్ని కేవలం కుటుంబ వేడుకగా కాకుండా సమాజ సేవకు అంకితం చేస్తూ నిరాశ్రయులకు చికెన్ కర్రీతో భోజనం ఏర్పాటు చేయడం పలువురి ప్రశంసలు అందుకుంది.
ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ 2 టౌన్ సీఐ బి. అప్పలనాయుడు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలు, నిరాశ్రయులు, నిర్భాగ్యులకు అండగా నిలుస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో ఆపన్నులకు చేదోడువాదోడుగా నిలవడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవడంతో పాటు, ఇతరులకు స్ఫూర్తినిచ్చే ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి ఇటువంటి కార్యక్రమాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
25 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న సాల్మన్ రాజు–సరిత దంపతులకు ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సాల్మన్ రాజు–సరిత దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఏ యు డి సిబ్బంది తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వివాహ వార్షికోత్సవ వేడుకను సేవా కార్యక్రమంగా మలచడం ద్వారా “మన ఆనందంలో కొంత భాగం సమాజానికి” అనే గొప్ప సందేశాన్ని ఈ దంపతులు అందించారు.

