హైదరాబాద్, జూన్
(పున్నమి జిల్లా రిపోర్టర్ )
ఖమ్మంలో లైంగిక దాడికి గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలికను నిమ్స్ ఆసుపత్రిలో ఎంపీ Etela Rajender పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఖమ్మంలో 7వ తరగతి చదువుతున్న బాలికపై 50 ఏళ్ల వ్యక్తి చేసిన దారుణం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బాలికకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు. బాలిక తన అమ్మమ్మ ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని, ఆమె తాత వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
దాడి కారణంగా బాలికకు తీవ్ర గాయాలయ్యాయని, వెన్నుపూస కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారని అన్నారు. మరో 15 రోజుల పాటు పరిస్థితిని పరిశీలించిన తర్వాతే ఆరోగ్య స్థితిపై స్పష్టత వస్తుందని వైద్యులు చెప్పినట్లు వివరించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దుర్మార్గుల్లో భయం కలిగించేలా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.



