కూసుమంచి/ ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పథకంతో రాష్ట్రంలో రేషన్ పంపిణీ జరుగుతున్నందున కొత్త రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని బీజేపీ పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ డిమాండ్ చేశారు. కూసుమంచి మండలం కేశపురం గ్రామంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి 2031 వరకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా పేదలకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం అందిస్తున్నారని తెలిపారు. కేంద్ర నిధులతో బియ్యం పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టడం సరికాదన్నారు.
13 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చినా అర్హులందరికీ అందలేదని ఆరోపించారు. డిజిటల్ రేషన్ కార్డుల ముద్రణ కాంట్రాక్టుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో దోపిడీ చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం భూభారతి, జీవో 22 ద్వారా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బెల్లం మురళి, కార్యదర్శి మీగడ గోపి, జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి, కోటి హనుమంతరావు, బద్దం వెంకటరెడ్డి, మంద చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.



