అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని గొల్లపేట గ్రామ ప్రజలు మంచినీటి సమస్యపై వినూత్నంగా కావుళ్ళుతో నిరసన చేపట్టారు.
ఈ గ్రామంలో సుమారు 45 కుటుంబాలు, 120 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇటీవల జల్ జీవన్ మిషన్ (JJM) ద్వారా ₹22 లక్షల వ్యయంతో నీటి ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పటికీ, రెండు రోజుల పాటు మాత్రమే నీటి సరఫరా జరిగి ఆ తర్వాత ఆగిపోయింది.
గ్రామ ప్రజలు తాగుతున్న నీరు కలుషితమై ఎర్రగా ఉండడంతో అనేక రోగాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు నర్సీపట్నం ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నెల రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామంలో 10,000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మించారు, ఇంటింటా కొళాయిలు వేశారు. అయితే, మోటర్‌కు విద్యుత్ సరఫరా లేమి కారణంగా నీటి సరఫరా ఆగిపోయింది. పాత ట్రాన్స్ఫార్మర్ బలహీనంగా ఉండడంతో కొత్త లైన్ ద్వారా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని గ్రామస్థులు తెలిపారు.
విద్యుత్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ సమన్వయంతో తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈ. చిరంజీవి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు, మేళం చిన్న రాజబాబుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.


