నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో వరుస చోరీలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా చిన్న అన్నలూరు గ్రామంలోని రాములవారి ఆలయం, అంకమ్మ ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.రాములవారి ఆలయంలో భక్తులు సమర్పించిన రెండు మంగళసూత్రాలను దొంగలు అపహరించారు. వాటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.అనంతరం అంకమ్మ ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు సుమారు 3 గ్రాముల బంగారం ఉన్న ముక్కుపుడకతో పాటు హుండీలోని సుమారు రూ.4 వేల నగదును ఎత్తుకెళ్లారు.ఇదిలా ఉండగా గత నెల రోజులుగా కలిగిరి మండలంలోని కృష్ణారెడ్డిపాలెం, కుడుములదిన్నెపాడు గ్రామాల్లోనూ చోరీలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా చోరీలు చోటుచేసుకుంటుండటంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఆలయాలను సైతం వదలకుండా దొంగలు చోరీలకు పాల్పడుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీలకు అడ్డుకట్ట వేసి, నిందితులను త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.



