ఫారెస్ట్ అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసి కలపను అక్రమంగా రవాణా చేసిన ఇద్దరు నిందితులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. CCS ఏసీపీ మహ్మద్ సర్వర్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం ఫారెస్ట్ రేంజర్ ఫిర్యాదు మేరకు గత డిసెంబర్‌లో కేసు నమోదు కాగా, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలతో ఏసీపీ మహ్మద్ సర్వర్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజ్‌కుమార్ గౌడ్ దర్యాప్తు చేపట్టారు. నల్లతుమ్మ కర్ర కోసం తీసుకున్న అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసి ‘సండ్ర కర్ర’గా మార్చి అయ్యగారుపల్లి, కురవి, సీరోలు, కంపెళ్లి, మహబూబాబాద్ ప్రాంతాల్లో సండ్ర చెట్లను నరికి విజయవాడకు చెందిన రాధే శ్యామ్‌కు విక్రయించిన సూర్యాపేట జిల్లా మోతే మండలం గోప్య తండాకు చెందిన కర్ర వ్యాపారి కొర్ర శివతో పాటు రాధే శ్యామ్‌ను అరెస్ట్ చేశారు. కొర్ర శివపై వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఫారెస్ట్ కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. రాధే శ్యామ్ ఈ కలపను మధ్యప్రదేశ్ జాబువాలోని AM ఎంటర్ప్రైజెస్ అబ్దుల్ రహేమాన్‌కు సరఫరా చేసినట్లు తెలిపారు. సుమారు 9 లారీల కలపను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు వెల్లడించారు. కేసులో ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. సిబ్బంది ఎస్‌ఐ ఎ. వంశీకృష్ణ, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, హరి, జానీ, నరింహారావు, సుధీర్, సతీష్, సుందర్, శ్రీధర్‌లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు .



