ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు గౌతమి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలలకు ప్రచారం చేసినట్లు ఆరోపణలు, సోషల్ మీడియాలో రీల్స్ చేసిన నేపథ్యంలో ఆమెను ఇటీవల విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా విడుదల చేసిన వీడియోలో గౌతమి భావోద్వేగానికి గురయ్యారు. ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించానని, కానీ తనకు జరిగిన పరిణామాలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని కన్నీటి పర్యంతమయ్యారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ కనీసం స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గౌతమి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.



