మహిళల స్వయం ఉపాధికి మరో ముందడుగు
ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ హరిత సంయుక్తంగా ప్రారంభించారు
పున్నమి ప్రతినిధి
ఆసిఫాబాద్ | ఆగస్టు 5, 2026
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (DRDA) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ స్టిచ్చింగ్ సెంటర్ హబ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మరియు జిల్లా కలెక్టర్ హరిత రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఈ స్టిచ్చింగ్ హబ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కుట్టు శిక్షణతో పాటు మార్కెట్ లింకేజీ కల్పించి, శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ ఉపాధి పొందేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఈ హబ్ ద్వారా జిల్లాలోని గ్రామీణ మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ, కుట్టు మిషన్లు, ముడి సరుకులు అందించనున్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం యూనిఫాంలు, పాఠశాల డ్రెస్‌లు, బ్యాగుల తయారీకి సంబంధించిన ఆర్డర్లు కల్పించే బాధ్యతను DRDA చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
స్టిచ్చింగ్ హబ్‌లో మొత్తం 50 కుట్టు మిషన్లు ఏర్పాటు చేయగా, తొలి విడతలో 100 మంది మహిళలకు శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో DRDA ప్రాజెక్టు డైరెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.



