ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి గత 20 రోజులుగా అదృశ్యమై ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు సోమవారం రవి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. రవి అదృశ్యానికి సంబంధించిన విషయాన్ని జనసేన కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి, కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆర్మీ జవాన్ రవి ఆచూకీ త్వరగా లభించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు. కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, ఈ విషయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉదయగిరి సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య, వరికుంటపాడు మండల నాయకులు నాయబ్ రసూల్, వెంకట్, రవి, జానీ, అనిల్ తదితరులు, స్థానికులు పాల్గొన్నారు.


