హోమ్ ఎగ్జామ్స్‌లో బాహ్య మూల్యాంకనాన్ని రద్దు చేయాలి
సంసిద్ధత లేకుండా బాహ్య మూల్యాంకనం చేపట్టడం అశాస్త్రీయం: టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్
——————————————————————- ప్రభుత్వ పాఠశాలల్లో హోమ్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ఒకటి నుంచి పదో తరగతి వరకు బాహ్య మూల్యాంకనం (External Evaluation) నిర్వహించాలనే విద్యాశాఖ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బోధనా పరిస్థితులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వసతులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.
బుధవారం జనగామలో టిపిటిఎఫ్ జనగామ జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎన్.ఎన్. రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన డి. శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి అనుగుణంగా విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించి, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నాన్ డిటెన్షన్ విధానంలో విద్యార్థుల వయస్సు ఆధారంగా పై తరగతులకు ప్రమోషన్ కల్పిస్తున్న నేపథ్యంలో, తగిన సంసిద్ధత లేకుండా ఒకటి నుంచి పదో తరగతి వరకు హోమ్ ఎగ్జామ్స్‌కు బాహ్య మూల్యాంకనం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే CCE, FLN, LIP, రెమిడియల్ తరగతులు, వివిధ విద్యాశాఖ కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు, ఆన్లైన్ అప్లోడ్లతో ఉపాధ్యాయుల బోధనా సమయం తగ్గిపోతోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను నియమించకపోవడం కూడా బోధనపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు ప్రణాళిక, తగిన శిక్షణ, అవసరమైన వనరులు కల్పించకుండా అకస్మాత్తుగా బాహ్య మూల్యాంకనం నిర్వహించాలని నిర్ణయించడం విద్యావ్యవస్థలో అయోమయానికి దారితీస్తుందని అన్నారు.
పదో తరగతి పరీక్షల మూల్యాంకనానికి సంబంధించిన పారితోషికాలు సైతం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని, అటువంటప్పుడు హోమ్ ఎగ్జామ్స్ బాహ్య మూల్యాంకనానికి అవసరమైన నిధులు ఎలా సమకూరుస్తారో విద్యాశాఖ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షుడు NN రాజు మాట్లాడుతూ బాహ్య మూల్యాంకనాన్ని భవిష్యత్తులో ప్రవేశపెట్టాలనుకుంటే కనీసం మూడు సంవత్సరాల ముందస్తు ప్రణాళికతో, ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, విద్యార్థులకు అభ్యసన సంసిద్ధత కల్పించి, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఐదో, ఏడో తరగతుల్లో మూల్యాంకన విధానం, డిటెన్షన్ విధానం వంటి అంశాలపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
విద్యాశాఖలో సంస్కరించాల్సిన అనేక అంశాలు ఉన్నాయని, ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల అభ్యసన స్థాయులను పెంపొందించేందుకు నాణ్యమైన బోధన, నిరంతర పర్యవేక్షణ, అవసరమైన ఉపాధ్యాయ నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
సంసిద్ధత, తగిన వనరులు లేకుండా ఈ విద్యా సంవత్సరంలోనే బాహ్య మూల్యాంకనాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని ఉపాధ్యాయులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను, ప్రభుత్వ పాఠశాలల వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, బాహ్య మూల్యాంకనాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అంకుషావలి వందన సమర్పణ చేశారు.. ఈ సమావేశానికి రాష్ట్ర కౌన్సిలర్ కుర్రేముల యాదగిరి, జిల్లా పూర్వ అధ్యక్షుడు B లక్మయ్య, మహమ్మద్ అంకుషావలి, y. వజ్రయ్య, శ్రీహరి, లక్మణ్ జీ, బానోతు వెంకన్న, సత్యనారాయణ రెడ్డి, దూడల రమేష్, శారదమ్మ మరియు జే రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు




