పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)
యలమంచిలి : ఏటికొప్పాక గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం ఒకవైపు వాలిపోవడంతో పాటు, పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న మట్టి వాలు కూడా జారిపడే పరిస్థితికి చేరింది. దీంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అటుగా రాకపోకలు సాగించే స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
విద్యుత్ స్తంభం, వైర్లు ప్రమాదకరంగా ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు, చుట్టుపక్కల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను గత మూడు నెలలుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థులకు లేదా ప్రజలకు ఏదైనా ప్రమాదం జరగకముందే విద్యుత్ శాఖ, పంచాయతీ, సంబంధిత అధికారులు సంయుక్తంగా పరిశీలించి వాలిన స్తంభాన్ని, విద్యుత్ వైర్లను, ప్రమాదకర వాలును వెంటనే సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే పరిస్థితి కాకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. పాఠశాల పరిసరాల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
Uploaded Video:


