హైదరాబాద్ / ఖమ్మం
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో పాలేరు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నున్నా రవికుమార్ పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు. CAPFకు చెందిన 10 కంటింజెంట్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించగా, 800 మందికి పైగా కళాకారులు బోనాలు, డప్పు, గుస్సాడి వంటి తెలంగాణ జానపద కళారూపాలను ప్రదర్శించారు. విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. సామూహికంగా నిర్వహించిన ‘వందే మాతరం’ కార్యక్రమంలో నున్నా రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించి, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సెప్టెంబర్ 17 చారిత్రక రోజని అన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వాన్ని, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు.



