భరణం కోరే హక్కు ప్రతి వృద్ధుడికీ ఉంది: సీనియర్ సివిల్ జడ్జి పి. విజయ్ కుమార్
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )
ఎలమంచిలి : అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రేమ సమాజంలో వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు, న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి. విజయ్ కుమార్ వృద్ధుల హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించారు. సొంత ఆదాయం లేదా ఆస్తి లేక తమను తాము పోషించుకోలేని తల్లిదండ్రులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు పిల్లలు లేదా చట్టపరమైన వారసుల నుంచి భరణం కోరే హక్కు కలిగి ఉంటారని తెలిపారు. వృద్ధులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు సబ్‌డివిజన్ స్థాయిలో ఆర్డీవో ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఉన్నాయని వివరించారు. సుదీర్ఘ సివిల్ కోర్టు ప్రక్రియకు బదులుగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మనీషా, డాక్టర్ మనోజ్, న్యాయవాదులు వెంకట రామకృష్ణారావు, ఎం. శ్రీనివాసరావు, బి.ఆర్. శంకర్రావు, ప్రేమ సమాజం కోఆర్డినేటర్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


