తాళ్లపూడి ఆగస్టు 8 : రెండు నెలల్లో అర్హులైన వారికి కొత్త పింఛన్లు – ఎమ్మెల్యే ముప్పిడి
తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పెంచిన పింఛన్లు, ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల ద్వారా అందుతున్న లబ్ధిని అడిగి తెలుసుకున్నారు.
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పలువురు మహిళలకు స్పందించిన ఎమ్మెల్యే.. రెండు నెలల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు లబ్ధిదారులకు సుమారు రూ.4 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కోడి శంకరం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిగిరిపల్లి గోపి, బూత్ ఇన్చార్జిలు మల్లెపూడి హనుమంతరావు, గెడ్డం రాధాకృష్ణ, తిరిగిపల్లి పండు, ముప్పిడి రాజేష్, బోడపాటి గంగరాజు, జనసేన నాయకులు కల్లూరి సుబ్రహ్మణ్యం, నామన బూరయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు బట్టు రమేష్, ప్రధాన కార్యదర్శి జొన్నకూటి రవితేజ, కూచిపూడి గణపతి, ప్రత్తిపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


