ఖమ్మం మే
(పున్నమి న్యూస్ జిల్లా ప్రతి నిధి )
ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆసుపత్రిలో కనీస సౌకర్యాల లేమితో రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విద్యుత్ సరఫరాకు సరిపడా ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో ఆసుపత్రిలో లో వోల్టేజ్ సమస్య తీవ్రమైంది. సాధారణంగా 240 వోల్ట్స్ రావాల్సిన చోట కేవలం 180 నుంచి 200 వోల్ట్స్ మాత్రమే వస్తుండటంతో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, బాలింతల విభాగాల్లోని ఏసీలు పనిచేయడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరచూ వోల్టేజ్ హెచ్చుతగ్గుల కారణంగా కీలక వైద్య పరికరాలు కాలిపోతుండటంతో చికిత్సా సేవలు దెబ్బతింటున్నాయని సమాచారం. ఏసీలు పనిచేయకపోవడంతో ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలలో దుర్వాసనలు వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే పరికరాలు కూడా సక్రమంగా పని చేయకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రోగులు, వైద్య సిబ్బంది మరింత ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించాలని ఆసుపత్రి సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమా..? అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన సమయం వచ్చిందని ప్రజలు కోరుతున్నారు.



