– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి: రైతు సంఘం
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ళ మణి డిమాండ్ చేశారు. సోమవారం చిట్వేల్ మండల కేంద్రంలో జరిగిన రైతు సంఘం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనె, కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మార్కెట్లో వంటనూనె కిలో రూ.180 నుంచి రూ.190 వరకు పలుకుతోందని తెలిపారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ధరలను అదుపు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మండల కార్యదర్శి కట్టారి శంకరయ్య, సహాయ కార్యదర్శి నరసింహ ఆచారి, నాయకులు ఒలిమి నాగయ్య, రైతులు చలపతి, రాజు, రమణయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


