తిరుపతి , ఆగస్టు 01 (పున్నమి ప్రతినిధి)
*నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశం
*నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి: తుడా ఛైర్మన్*
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తుడా టవర్స్ నిర్మాణ పనులను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి , వైస్ ఛైర్మన్ ఆర్. గోవిందరావు శనివారం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు.
టవర్స్ ప్రాంగణంలో జరుగుతున్న వివిధ భాగాల నిర్మాణ పురోగతిని, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షించారు.
ఈ పరిశీలనలో భాగంగా తుడా ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు భవనం మొత్తాన్ని కలియ తిరిగి చూశారు.
ప్రతీ ఫ్లోర్లో జరుగుతున్న పనుల పురోగతిని, సివిల్, ఇంజనీరింగ్ పనుల తీరును స్వయంగా తనిఖీ చేశారు.
భవన డిజైన్, మౌలిక వసతుల కల్పన, పార్కింగ్ మరియు అంతర్గత నిర్మాణ పనులపై అధికారులతో, ప్రాజెక్టును నిర్మిస్తున్న ‘కేపీసీ’ (KPC) నిర్మాణ సంస్థ ప్రతినిధులతో చర్చించారు.
ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ… తిరుపతి నగరంలో అత్యుత్తమ ప్రమాణాలతో ఈ టవర్స్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని KPC నిర్మాణ సంస్థ ప్రతినిధులకు స్పష్టమైన సూచనలు చేశారు.
సాంకేతిక నిపుణుల సలహాలను పాటిస్తూ, అత్యాధునిక ప్రమాణాలతో ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
వైస్ ఛైర్మన్ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ… పనుల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని, నిర్మాణ సంస్థకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక, పరిపాలనా సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు.
కేటాయించిన గడువులోగా పనులు పూర్తి చేసి, భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి సమిష్టిగా కృషి చేయాలని KPC సంస్థను, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు ఎస్ ఈ రవీంద్రయ్య భూసేకరణ అధికారి సుజన ప్లానింగ్ అధికారులు, తుడా అధికారులు, కేపీసీ సంస్థ ప్రతినిథులు, తదితరులు పాల్గొన్నారు.






