సేవలపై ప్రశంసలు
తిరుచానూరు, ఆగస్టు 01 (పున్నమి ప్రతినిధి)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అసిస్టెంట్ షరాబ్‌గా సేవలందించి పదవీ విరమణ చేసిన పద్మనాభ రెడ్డిని ఆలయాధికారులు ఘనంగా సత్కరించారు. శనివారం ఆలయ సమీపంలోని కల్యాణ మండపంలో నిర్వహించిన వీడ్కోలు సభలో ఆయనకు దుశ్శాలువా కప్పి, పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు మాట్లాడుతూ, పద్మనాభ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో అంకితభావంతో విధులు నిర్వహించి ఆలయ సేవకు విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలు సహోద్యోగులకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొంటూ, పదవీ విరమణ అనంతరం కూడా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయులు, సురేష్, రమేష్, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీకాంత్, చలపతి, మునస్వామి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


