తిరుపతి,ఆగస్టు 01 (పున్నమి ప్రతినిధి)
ఒకటి నుంచి పదవ తరగతి లోపు విద్యార్థులకు సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా శిశు వికాస్ యోజన పథకం అందించే సౌకర్యాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బాపూజీ విద్యాసంస్థల అధినేత వేమూరి బాలాజీ నాయుడు కోరారు. పివిఆర్ గ్రూప్ ఆర్గనైజేషన్ చే ఆ పాఠశాలకు చెందిన గుండ్రాజు దీక్షితకు శిశు వికాస్ యోజన సభ్యత్వ పత్రాన్ని శనివారం ఆయన అందజేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర సూపర్వైజర్ వెంకటరమణ, కోఆర్డినేటర్ లక్ష్మయ్య, జిల్లా ఇంచార్జ్ సుకుమార్ రాజులు మాట్లాడుతూ శిశు వికాస్ యోజన ప్రయోజనాలను వివరించారు. సభ్యత్వం పొందిన ప్రతి విద్యార్థి ఏడాదిలో చికిత్స కోసం 25 వేల గ్రాంటు, ఉన్నత విద్య కోసం ఐదు లక్షల స్కాలర్షిప్, మూడులక్షల ప్రాణ నష్టపరిహారం లతోపాటు ఐదు నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఏటా 3000 నుంచి 7000 వరకు స్కాలర్షిప్లు, 21 సంవత్సరాల తరువాత ఐదు సంవత్సరాల పాటు ఏటా రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణం అందజేస్తారని వివరించారు. ఎన్రోల్ కావడానికి విద్యార్థి ఆధార కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తల్లితండ్రుల ఆధార కార్డు పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలు అందజేసి ఫ్యామిలీ గ్రూప్ ఫోటో తో సభ్యత్వం పొందవచ్చునన్నారు. పాఠశాల డైరెక్టర్ వేమూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే ఈ శిశు వికాస్ యోజనలో సభ్యత్వం పొంది సి ఎస్ ఆర్ ఫండ్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు హెడ్మాస్టర్ మధు, విద్యార్థిని దీక్షిత తల్లిదండ్రులు పరమానంద్, గిరిజ, ఆపరేటర్ వి ధరణి పతి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


