– *పాత పరిచయంతో నగదు మరియు ఆభరణాల కోసం నమ్మించి వృద్దురాలిని హత్య చేసిన నిందితుడు.*
– *హత్య చేసి సుమారు 12 లక్షల రూపాయల విలువ గల 90 గ్రాముల బంగారు ఆభరణాలు, ₹47,000 నగదు అపహరించిన నిందితుడు అరెస్ట్.*
– *భారత రైల్వే శాఖ లోని కృష్ణపట్నం రైల్వే స్టేషన్ నందు లోకో పైలెట్ గా పని చేస్తున్న నిందితుడు.*
– *మారువేషం, దొంగిలించిన స్కూటీ, ఫేక్ నంబర్ ప్లేట్ ఉపయోగించినప్పటికీ శాస్త్రీయ–సాంకేతిక దర్యాప్తుతో నిందితుడిని గుర్తించిన పోలీసులు.*
– *కృష్ణపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడు పాశం రూపేష్ కుమార్ అరెస్ట్.*
– *ప్రత్యేక బృందాల సమన్వయం, సాంకేతిక ఆధారాలతో కేసును విజయవంతంగా ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులు.*
– *కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు*
– *నేరస్థుడు ఎంత తెలివిగా ప్రణాళిక రచించినా చట్టం నుండి తప్పించుకోలేడని జిల్లా ఎస్పీ స్పష్టం.*
పున్నమి ప్రతినిధి,తిరుపతి జులై 26
తిరుపతి *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* గారు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన “మర్డర్ ఫర్ గెయిన్” కేసు ఛేదనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
తేదీ 14-07-2026న తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ పంచాయతీ, విజయనగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న **శ్రీమతి ఎం. జ్యోతి (69)**పై నిందితుడు అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ధరించిన బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న సుమారు 90 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు ₹47,000 నగదు అపహరించి పరారయ్యాడు.
దర్యాప్తులో పాత పరిచయాన్నే అవకాశంగా మార్చుకున్న నిందితుడు పాశం రూపేష్ కుమార్, వయసు 36 సంవత్సరములు, గుడిపల్లిపాడు గ్రామము, నెల్లూరు రూరల్ మండలము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా రైల్వే శాఖలో లోకో పైలట్‌గా కృష్ణపట్నం రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బాధిత కుటుంబంతో గత కొన్నేళ్లుగా ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, కుటుంబ పరిస్థితులపై ఉన్న అవగాహనతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా బంగారు ఆభరణాలను అపహరించి విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఈ నేరాన్ని అమలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
తన గుర్తింపును దాచిపెట్టేందుకు నిందితుడు ముందుగానే నేరానికి పకడ్బందీ ప్రణాళిక చేసుకొని, తనతో పాటు పని చేస్తున్న లోకో పైలెట్ కి చెందిన స్కూటీనీ దొంగతనము చేసి…ఫేక్ నంబర్ ప్లేట్ ను అమర్చాడు. మహిళలు ధరించే నల్లని బురఖా, ముఖానికి స్కార్ఫ్, హెల్మెట్ ధరించి తిరుపతికి చేరుకున్నాడు.
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి జిల్లా పోలీసులు శాస్త్రీయ–సాంకేతిక డిజిటల్ ఆధారాలు, ఇతర శాస్త్రీయ సాక్ష్యాలను సమగ్రంగా విశ్లేషించారు. నిందితుడి యొక్క ప్రతి కదలికను అనుసంధానం చేస్తూ ప్రత్యేక బృందాలు నిరంతరంగా దర్యాప్తు కొనసాగించి, చివరకు కృష్ణపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అరెస్టు చేశారు.
నిందితుడి వద్ద నుంచి దర్యాప్తులో భాగంగా సుమారు 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు….నేరానికి ఉపయోగించిన కత్తి తో పాటు ..నేరానికి వాడిన స్కూటీని స్వాధీనం చేసుకోవడమైనది.
– ప్రత్యేక బృందాల కృషి
ఈ కేసు దర్యాప్తును అడిషనల్ ఎస్పీలు శ్రీ ఆర్ల శ్రీనివాసులు, శ్రీ కె. రవి మనోహరాచారి వారి ఆధ్వర్యంలో, చంద్రగిరి ఎస్‌డీపీఓ శ్రీ బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు నిర్వహించాయి.
తిరుపతి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. మద్దయ్య చారి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శివకుమార్ రెడ్డి, శ్రీ టి. అబ్బన్న, ఎస్‌ఐలు శ్రీ పి. శ్రీరాములు, శ్రీమతి జ్యోతి, శ్రీ నాగార్జున రెడ్డి, శ్రీ చిరంజీవి, ఐడీ పార్టీ సిబ్బంది లక్ష్మీ ప్రసాద్, గౌస్ అరీఫ్, సూర్య ప్రసాద్, ప్రభాకర్, ప్రసాద్, శ్రీనివాసులు, రమేష్, నాగరాజు శెట్టి, మురళి లతో సమన్వయంతో పనిచేసి కేసును విజయవంతంగా ఛేదించారు.
మీడియా సమావేశంలో జిల్లా *ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* గారు మాట్లాడుతూ, “నేరం చేసి తప్పించుకోవచ్చని ఎవరూ భావించవద్దు. నేరస్థుడు ఎంత పకడ్బందీగా ప్రణాళిక రచించినా, ఎంత మారువేషం ధరించినా, ఎన్ని ఆధారాలు చెరిపివేయాలని ప్రయత్నించినా శాస్త్రీయ–సాంకేతిక దర్యాప్తు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మరియు పోలీసుల నిరంతర నిఘా ముందు తప్పించుకోవడం అసాధ్యం. ప్రతి నేరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతి ఆధారాన్ని సూక్ష్మంగా విశ్లేషించి నేరస్థులను చట్టం ముందు నిలబెట్టడం తిరుపతి జిల్లా పోలీసుల బాధ్యత. ప్రజల భద్రతకు భంగం కలిగించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదు. నేరస్థుడు ఎంత దూరం పారిపోయినా, చట్టం ధృష్టి నుండి తప్పించుకోలేడు.” అని అన్నారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన అధికారులను, ప్రత్యేక దర్యాప్తు బృందాలను మరియు సిబ్బందిని *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు., ఐపీఎస్.,* గారు అభినందించారు.




