ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు, కోచ్‌లకు ఘన సన్మానం
ఉట్నూర్, ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏ ఉట్నూర్ ఆధ్వర్యంలో కె.బి. కాంప్లెక్స్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మంద మకరంద్ జెండా ఊపి క్రీడా ర్యాలీని ప్రారంభించారు. ఉట్నూర్ ఐ.బి. చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ కె.బి. కాంప్లెక్స్ వరకు కొనసాగింది.
అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన గిరిజన క్రీడా పాఠశాల, ఆసిఫాబాద్ విద్యార్థినులను ఘనంగా సన్మానించారు. అథ్లెటిక్స్ విభాగంలో ఎం. రాజేశ్వరి, ఎం. అఖిల, హ్యాండ్‌బాల్ విభాగంలో డి. నందిని, ఎ. మౌనిక, ఖో-ఖో విభాగంలో సిహెచ్. జంగుబాయి, కె. సత్యశీలలను సత్కరించారు.
అదేవిధంగా గిరిజన క్రీడాకారులకు విశేష సేవలు అందిస్తూ, వారిని క్రీడల్లో తీర్చిదిద్దుతున్న అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, హ్యాండ్‌బాల్ కోచ్ ఎస్. అరవింద్, ఖో-ఖో కోచ్ వాసం తిరుమల్లను శాలువా, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సన్మాన కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ప్రేమకళ, ఏపీఓలు భాస్కర్, వసంత్, డిప్యూటీ డీఈఓ (ఏజెన్సీ) చందన్, క్రీడల అధికారులు పార్థసారథి, షేకు నిర్వహించారు.
క్రీడాకారిణులు, కోచ్‌లను డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ (కెబీ ఆసిఫాబాద్) జాదవ్ అంబాజీ, ఏసీఎంఓ ఉద్దవ్, జీసీడీఓ శకుంతల, ఏటీడీఓ చిరంజీవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబారావు, వ్యాయామ ఉపాధ్యాయులు మీనా రెడ్డి, హెచ్‌డబ్ల్యూఓలు విజయలక్ష్మి, సరితతో పాటు పాఠశాల అధ్యాపక బృందం అభినందించింది.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా గిరిజన విద్యార్థుల్లో క్రీడల పట్ల మరింత ఆసక్తి, ఉత్సాహం పెంపొందించేందుకు అవకాశం ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు.
– పున్నమి రిపోర్టర్



