దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ…దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ… పులివెందులలో మాత్రం జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీకి… పులివెందులలో ఆగస్టు 15న జెండా వందనం చేసేందుకు నాయకుడే కరువయ్యారా?ఇదే ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్న ప్రశ్న…పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసేందుకు ఒక్క నాయకుడు కూడా ముందుకు రాకపోవడం విస్మయం కలిగిస్తోంది.దేశం మొత్తం జాతీయ జెండాలతో కళకళలాడుతుంటే… చిన్నారుల నుంచి యువత వరకు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొంటుంటే… ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేస్తుంటే…పులివెందుల కాంగ్రెస్ కార్యాలయం మాత్రం వెలవెలబోయింది.కార్యాలయానికి గేటుకు తాళం…
లోపల చూస్తే చెత్తాచెదారం…కంప చెట్లతో నిండిపోయిన ప్రాంగణం…
కార్యకర్తలు, నాయకుల సందడి కనిపించని పరిస్థితి…స్వాతంత్ర్య పోరాట చరిత్రతో ముడిపడి ఉన్న పార్టీకి చెందిన కార్యాలయంలోనే… స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఇలాంటి పరిస్థితి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన రోజున… పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి ఉండటం ఎంతవరకు సమంజసం?కాంగ్రెస్ పార్టీకి పులివెందులలో నాయకత్వం ఉందా?
కార్యకర్తలు ఉన్నారా?
లేదా పార్టీ కార్యక్రమాలకే నాయకులు దూరమయ్యారా?
అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన పులివెందులలో… నేడు జాతీయ పండుగ రోజున కనీసం జెండా వందనం చేసేందుకు కూడా నాయకత్వం ముందుకు రాకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జాతీయ జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదు… కోట్లాది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక.అలాంటి జాతీయ జెండాకు వందనం చేయాల్సిన రోజున… పార్టీ కార్యాలయమే తాళం వేసి కనిపించడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం, స్థానిక నాయకత్వం స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇకనైనా పులివెందుల కాంగ్రెస్ నాయకత్వం మేల్కొంటుందా?
పార్టీ కార్యాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తుందా?ప్రతి జాతీయ పండుగను బాధ్యతగా నిర్వహించేలా కార్యాచరణ చేపడుతుందా?స్వాతంత్ర్య పోరాట వారసత్వాన్ని చెప్పుకునే పార్టీకి… పులివెందులలో కనిపిస్తున్న ఈ దుస్థితికి కారణమేంటి?సమాధానం చెప్పాల్సింది మాత్రం స్థానిక కాంగ్రెస్ నాయకత్వమే.








