ఖమ్మం నగరానికి మణిహారంగా నిలవనున్న మున్నేరు తీగల వంతెన నిర్మాణం తుది దశకు చేరుకుంది. కాల్వొడ్డు–జలగంనగర్ మధ్య మున్నేరు నదిపై నిర్మిస్తున్న ఈ వంతెనకు ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేసింది.
టెండర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం 2024 ఫిబ్రవరిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత పనులు నెమ్మదిగా సాగినా.. ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. వంతెన మొత్తం ప్రాజెక్టు పొడవు సుమారు 1.25 కిలోమీటర్లు కాగా, ప్రధాన కేబుల్ బ్రిడ్జి భాగం సుమారు 300 మీటర్లు ఉంటుంది. నాలుగు వరుసల రహదారి, సెంట్రల్ డివైడర్, ఫుట్పాత్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
2026 జూన్ నాటికి పనులు సుమారు 85 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను మూడు నెలల్లో పూర్తి చేసి 2026 సెప్టెంబర్లో వాహన రాకపోకలకు వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
వంతెన అందుబాటులోకి వస్తే ఖమ్మం నగరం–రూరల్ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభం కానున్నాయి.


