స్థానిక యువతకు ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి: ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
పున్నమి న్యూస్ ఓజిలి
తిరుపతి జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామంలో సుమారు రూ.57 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆక్టేవ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రారంభం కావడం నియోజకవర్గానికి శుభపరిణామమని ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
హ్యూమన్ మెడికేషన్కు సంబంధించిన ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో పరిశ్రమను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కంపెనీలోని వివిధ విభాగాలను, ఔషధాల తయారీకి ఏర్పాటు చేసిన ఆధునిక యంత్ర పరికరాలను ఈ సందర్భంగా పరిశీలించారు.
ప్రభుత్వ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీలో ఆధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సెంట్రిఫ్యూజ్, డ్రైయింగ్ తదితర ప్రక్రియలకు అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉండటంతో నాణ్యమైన ఔషధాల తయారీకి అవకాశం ఉందన్నారు.
ఈ పరిశ్రమ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నందున, స్థానిక యువతకు ప్రాధాన్యతనిస్తూ వీలైనంత ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరారు.
ముఖ్యంగా సురేష్, రవి తదితర యాజమాన్య ప్రతినిధులు స్థానిక యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
వారి కృషితో నియోజకవర్గంలోని అత్తివరం, మేనకూరు,తడ, శ్రీసిటీ, మాంబట్టు తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు నియోజకవర్గానికి తీసుకువచ్చి ప్రజలకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేలా అందరూ కలిసి పనిచేస్తామని తెలిపారు.
ఆక్టేవ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సంస్థ మరింత అభివృద్ధి చెంది నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


