గురువే జ్ఞానజ్యోతి.. భావితరాలకు మార్గదర్శి!
యలమంచిలి , సెప్టెంబర్ 5 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మల్ల రమణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని, ఆయన చిత్రపటానికి పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యారంగానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అనంతరం పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ గారు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి సీనియర్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కె. అమ్మాజీ గారిని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆమె అందిస్తున్న సేవలను అభినందిస్తూ శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, విలువలు, మంచి నడవడికను నేర్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే గురువుల సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమం గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞతను చాటిచెప్పేలా ఉత్సాహభరితంగా సాగింది.


