ఆదిభట్ల పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
పున్నమి న్యూస్
10 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫిర్యాదిదారుడు రాయవరపు ప్రేమ్ కుమార్ (50), ORR ఇన్సిడెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు అనగా 10-05-2026 తేదీన ఉదయం సుమారు 03:20 గంటల సమయంలో బొంగులూరు నుంచి తుక్కుగూడ వైపు వెళ్తున్న మార్గంలోని 111.5 కిలోమీటర్ వద్ద, ఎగ్జిట్-12 సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది.
AP 40 HY 9599 నంబర్ గల కారు డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ అదే మార్గంలోని నాలుగో లైన్‌లో ముందుగా వెళ్తున్న 28 TB 9380 నంబర్ గల కంటైనర్ ట్రక్‌ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు ORR రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ సమాచారం అందించారు.
వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర రక్తగాయాలతో మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం పోలీసుల సహాయంతో మృతదేహాలను కారులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మృతులను కారు డ్రైవర్ కత్తి భరత్ కాంత్ (31), సినీ నటుడు, నెల్లూరు నివాసి మరియు గూడ సాయి త్రిలోక్ (31), నెల్లూరు నివాసిగా గుర్తించారు. వీరు ఇద్దరూ నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
— SHO అడిబట్ల




