*ఆ రూ.4 కోట్లు ఎక్కడివి..?*మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏపీ, తెలంగాణలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కడప జిల్లా పులివెందులలో మొత్తం 6 చోట్ల శుక్రవారం ఉదయం నుంచి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కోకాపేటలో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో హైదరాబాద్ ఈడీ జోనల్ అధికారుల బృందాలు సోదాలు చేస్తున్నాయి. పులివెందులలోని అవినాష్‌రెడ్డి నివాసానికి ఈడీ అధికారులు వెళ్లగా.. తాళం వేసి ఉండటంతో బయటే కొద్ది సేపు వేచి ఉన్నారు. కాసేపటికి అవినాష్ రెడ్డి చిన్నాన్న మనోహర్‌రెడ్డిని పిలిపించిన అధికారులు.. తాళం తెరిపించి సోదాలు జరుపుతున్నారు. వివేకా హత్య కేసు నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. వివేకా హత్య కేసులో రాజకీయ నేతల ప్రమేయం, మనీలాండరింగ్ పై ఈడీ ఆరా తీస్తోంది. హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. సీబీఐ దర్యాప్తు సమయంలో బయటకొచ్చిన అంశాలపై మరింత లోతుగా విచారణ చేస్తోంది. నిందితులకు ఇచ్చిన రూ.4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయన్న అంశంపైనే ఈడీ ప్రధానం దృష్టి సారించింది.


