అనపర్తి, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భారీగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గర్ల్స్ హైస్కూల్ నుంచి పంచాయతీ కార్యాలయం మీదుగా రైల్వేస్టేషన్, దేవీచౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో ర్యాలీ సాగడంతో అనపర్తి పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ జెండా విశిష్టత, ఔన్నత్యాన్ని చాటిచెప్పడంతో పాటు ప్రతి పౌరుడిలో దేశభక్తి, జాతీయతా భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ప్రతి పౌరుడు కాపాడేలా అవగాహన కల్పించడమే తిరంగా యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. గత ఏడాది కూడా పెద్ద ఎత్తున ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ ఏడాది కూడా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు అనపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనపర్తి టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



