అనుమతి లేని తయారీ, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు
పున్నమి ప్రతినిధి ఆనంద్
అనకాపల్లి, సెప్టెంబర్ 20: జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అనుమతి పొందిన కేంద్రాల్లో అగ్నిమాపక పరికరాలు, నీరు, ఇసుక తదితర భద్రతా ఏర్పాట్లు నిబంధనల ప్రకారం ఉన్నాయో పరిశీలించాలన్నారు. నివాస ప్రాంతాలు, జనసమ్మర్థ ప్రదేశాల్లో బాణాసంచా తయారీ లేదా భారీ నిల్వలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మైనర్లు, నైపుణ్యం లేని వారిని పనిలో పెట్టుకోవద్దన్నారు. అక్రమ తయారీ, నిల్వ, విక్రయాలపై సమాచారం ఉంటే ప్రజలు స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు తెలియజేయాలని ఎస్పీ కోరారు. సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


