Sunday, 27 September 2026

Tag: బ్రేకింగ్ న్యూస్

ప్రకాశం

టెట్ సమస్య పరిష్కారానికి ఏపీటీఎఫ్ నిరవధిక ధర్నాను విజయవంతం చేయండి

– పామూరు మండల ఏపీటీఎఫ్ నాయకుల పిలుపు పామూరు: ఉపాధ్యాయులకు సంబంధించిన టెట్ పరీక్షల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రేపటి నుండి విద్యాభవన్ ముందు చేపట్టనున్న నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పామూరు మండల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల శ్రీనివాసులు, షేక్ ఖాజా మస్తాన్, జిల్లా కౌన్సిలర్ మచ్చ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం టెట్ నిర్వహణ విధానంలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా టెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్ (మాన్యువల్) పద్ధతిలో నిర్వహించాలని కోరారు. అలాగే టెట్‌లో ప్రస్తుతం ఉన్న అర్హత మార్కులను తగ్గించి అందరికీ కనీస అర్హత పాస్ మార్కులను 40 శాతంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ మరియు బయోలాజికల్ సైన్స్ (పీఎస్ , బిఎస్ ) ఉపాధ్యాయులకు వారి వారి సంబంధిత సబ్జెక్టుల్లోనే టెట్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర సబ్జెక్టులపై పరీక్ష నిర్వహించడం వల్ల ఆయా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా టెట్‌కు సంబంధించిన ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏపీటీఎఫ్ చేపడుతున్న ఈ పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు మద్దతు పలకాలని, రేపటి నుండి విద్యాభవన్ ముందు జరిగే నిరవధిక ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పామూరు మండల ఏపీటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. డిమాండ్లు నెరవేరే వరకు ఏపీటీఎఫ్ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

రంగారెడ్డి

అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణం.. చర్యలు ఎప్పుడూ?

అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణం.. చర్యలు ఎప్పుడూ? గ్రామపంచాయతీ ఆదాయానికి గండి.. నిబంధనలు బేఖాతర్! ఇబ్రహీంపట్నం, ఆగస్టు 31: ఇబ్రహీంపట్నం మండలం కల్సా ఉప్పరిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని పోచారం CVR కళాశాల సమీపంలో అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మించి వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తాయి. రీవేరా (Rivera) ఫంక్షన్ హాల్ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించారని, దీనివల్ల గ్రామపంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ప్రజావాణి అధికారికి ఫిర్యాదు చేశారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం, నిర్వహణపై గ్రామపంచాయతీ కార్యదర్శికి పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వార్డు సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారని, దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలను పరిశీలించాలని కోరారు. గ్రామపంచాయతీ ఆదాయానికి నష్టం కలుగుతున్న నేపథ్యంలో సంబంధిత ఫంక్షన్ హాల్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజావాణి అధికారి ఇబ్రహీంపట్నంకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు నర్కుడి మహేందర్, కొంగరి రవితేజ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

యాచారం సమస్యలపై సీపీఎం సమర శంఖం!

యాచారం సమస్యలపై సీపీఎం సమర శంఖం! ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి యాచారం, ఆగస్టు 31: స్థానిక సమస్యలు, భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ మాట్లాడుతూ మండలంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను ప్రభుత్వం, అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్మన్నగూడ నుంచి పెత్తుల వరకు బీటీ రోడ్డుకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని, నందివనపర్తి, సింగారం, కురిమిద్య, తాడిపర్తి గ్రామాల్లోని సుమారు 1,400 ఎకరాల దేవాదాయ భూములను కౌలు రైతుల పేర్లపై పట్టా చేసి పట్టాదారు పాస్‌బుక్కులు మంజూరు చేయాలని కోరారు. ఫార్మాసిటీ నిషేధిత జాబితాలో ఉన్న రైతుల పేర్లను తొలగించి, వారికి అన్ని హక్కులు, ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చింతపట్ల గ్రామంలోని సర్వే నంబర్లు 209, 210లోని రెండు ఎకరాల భూమిని అర్హులైన పేదలకు ఇంటి స్థలాలుగా కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. మంథన్‌గౌరెల్లి గ్రామంలోని సర్వే నంబర్ 104లో ఉన్న 1 ఎకరం 5 గుంటల స్మశానవాటిక భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి రక్షించాలని డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాలు, తండాలకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అన్ని గ్రామాలకు కృష్ణా జలాల సరఫరా పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, అన్ని రకాల భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రజలను చైతన్యపరిచి ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి. అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. చందునాయక్, ఆలంపల్లి జంగయ్య, మండల కమిటీ సభ్యులు వెంకటయ్య, బాలరాజ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీమన్నారాయణ, మాజీ సర్పంచ్ ఎం. భాషయ్య, శాఖ కార్యదర్శులు రమేష్, జంగయ్య, సురేష్, నాయకులు జంగారెడ్డి, రాములు, కుమార్, భాస్కర్, పంతునాయక్, పాల్గొన్నారు.

రంగారెడ్డి

కొత్తపల్లిలో ఘనంగా వర్ధపాశం కార్యక్రమం

కొత్తపల్లిలో ఘనంగా వర్ధపాశం కార్యక్రమం సమృద్ధిగా వర్షాలు కురవాలి.. పాడిపంటలు పుష్కలంగా పండాలి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు.. ఆటలు, పాటలు, భజనలతో పండుగ వాతావరణం కొత్తపల్లి, ఆగస్టు 30: వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు పుష్కలంగా పండాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ కొత్తపల్లి గ్రామంలో వర్ధపాశం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పెసర్ల బండ వద్ద ఆదివారం సాయంత్రం 3 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయబద్ధంగా నీళ్లు పోసి వరుణ దేవుడిని ప్రార్థించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని, రైతుల పంటలు పుష్కలంగా పండాలని, గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఆటలు–పాటలు.. భజనలతో సందడి వర్ధపాశం కార్యక్రమం సందర్భంగా గ్రామంలో ఆటలు–పాటలు, భజన కార్యక్రమాలు నిర్వహించడంతో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, యువత, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలంతా ఒక కుటుంబంలా ఏకమై సంప్రదాయాలను కొనసాగిస్తూ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ దేవతల ఆశీస్సులతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి దిగుబడులు రావాలని పలువురు ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల హాజరు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ సర్పంచ్ చిక్కుడు వెన్నెల–శేఖర్, ఉపసర్పంచ్ కాలె అనిత–రమేష్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉపసర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, రైతుల శ్రేయస్సు కోసం గ్రామ దేవతలను ప్రార్థించారు. సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు “వరుణ దేవుని కరుణతో సమృద్ధిగా వర్షాలు కురవాలి.. రైతుల పంటలు పుష్కలంగా పండాలి.. కొత్తపల్లి గ్రామం సుఖసంతోషాలతో, సుభిక్షంగా వర్ధిల్లాలి” అని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కంబాలపల్లి జంగయ్య (మాజీ ఉపసర్పంచ్), కావాలి జగన్, కాసా నరసింహ, కాలే రమేష్, సోమరాజు, శివకుమార్, వంగ వెంకట్ రెడ్డి, తలారి సత్యనారాయణ (1వ వార్డు సభ్యుడు), వంగ సంజీవరెడ్డి, కొండ్రెడ్డి రాజు, పోలే శివ, కంబాలపల్లి కుమార్, కాస నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలి.. పాడిపంటలు పుష్కలంగా పండాలి!

రంగారెడ్డి

ఇంజాపూర్‌లో ప్రభుత్వ భూమి కబ్జా..?

ఇంజాపూర్‌లో ప్రభుత్వ భూమి కబ్జా..? సర్వే నం.66లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు.. రెవెన్యూ అధికారుల కూల్చివేత “ప్రభుత్వ భూమికి కంచె వేయాలి”.. స్థానికుల డిమాండ్‌ ఇంజాపూర్‌, ఆగస్టు 30: ఇంజాపూర్‌ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిపై ఆక్రమణల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇంజాపూర్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 66లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ స్థానికుల నుంచి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఎలా? ప్రభుత్వానికి చెందిన భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ఎలా ఏర్పడిందన్న ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణకు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ, నిర్మాణాలు జరిగే వరకు విషయం అధికారుల దృష్టికి రాకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జర్నలిజం ముసుగులో కబ్జాలా..? ఈ వ్యవహారంలో జర్నలిజం ముసుగులో కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కంచె వేయాలని డిమాండ్‌ ఇప్పటికే అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన నేపథ్యంలో ప్రభుత్వ భూమి మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా సర్వే నంబర్‌ 66లోని ప్రభుత్వ భూమికి శాశ్వతంగా కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. భూమి హద్దులను స్పష్టంగా గుర్తించి, ప్రభుత్వ ఆస్తి అని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ భూమి రక్షణకు శాశ్వత చర్యలు తీసుకుంటారా? లేక మళ్లీ ఆక్రమణలకు అవకాశం కల్పిస్తారా? అనేది వేచి చూడాలి.

రంగారెడ్డి

నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి!

నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి! శేరిగూడ పరీక్ష కేంద్రంలో కలకలం.. పరీక్ష రాయకుండానే వెనుదిరిగిన అభ్యర్థి ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30: ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగూడలో ఉన్న నీట్ పీజీ పరీక్ష కేంద్రంలో ఆదివారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి మద్యం సేవించి పరీక్షకు హాజరైనట్లు అధికారులు గుర్తించారు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే సమయంలో సదరు విద్యార్థి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పరీక్షా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో నిబంధనల ప్రకారం సదరు అభ్యర్థిని పరీక్ష రాయడానికి అనుమతించకుండా వెంటనే పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించారు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్‌గా సదరు విద్యార్థిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పరీక్ష కేంద్రం వద్ద చర్చనీయాంశంగా మారింది. పరీక్షా కేంద్రంలో భద్రతా చర్యల్లో భాగంగా అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం మాత్రమే లోపలికి అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థి మద్యం సేవించిన విషయం బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనపై పరీక్షా నిర్వాహకులు తీసుకున్న తదుపరి చర్యలు ఏమిటి? సదరు అభ్యర్థిపై ఎలాంటి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు? అనే విషయాలపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రంగారెడ్డి

కళ్లముందే అక్రమ నిర్మాణం.. అధికారుల మౌనం ?????

కళ్లముందే అక్రమ నిర్మాణం.. అధికారుల మౌనం! చోద్యం చూస్తున్న అధికారులు.. ప్రభుత్వ ఆదాయానికి గండి నిబంధనలకు పాతరేస్తున్న నిర్మాణదారులు.. ఫిర్యాదులు చేసినా స్పందన కరువు పెద్ద అంబర్‌పేట్, ఆగస్టు 30: ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్‌లో అనుమతులు లేకుండానే భారీ షెడ్ నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. రేకులు, ఇనుప నిర్మాణాలతో కొనసాగుతున్న ఈ షెడ్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణం ప్రారంభ దశలోనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాల్సిన అధికారులు నిశ్శబ్దంగా ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అధికారుల పనితీరుపై విమర్శలకు తావిస్తోంది. ఫిర్యాదులు చేసినా.. చర్యలు ఎక్కడ? అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతుంటే ప్రారంభంలోనే పనులను నిలిపివేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్ద అంబర్‌పేట్‌లో భారీ షెడ్ నిర్మాణం బహిరంగంగా సాగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణం దాదాపు పూర్తయ్యే వరకు అధికారులు పట్టించుకోకపోవడం వెనుక కారణాలేమిటో వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిన్న నిర్మాణాలపై కఠినత.. భారీ షెడ్‌పై ఎందుకు మౌనం? చిన్నపాటి నిర్మాణాల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే నోటీసులు, చర్యలు తీసుకునే అధికారులు.. ఇంత భారీ స్థాయిలో షెడ్ నిర్మాణం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. సామాన్యుల నిర్మాణాలపై నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ, పెద్ద నిర్మాణాల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు ఉన్నాయా? స్థల వినియోగానికి సంబంధించిన అనుమతులు, నిర్మాణ అనుమతి, ఇతర సంబంధిత శాఖల నుంచి తీసుకోవాల్సిన అనుమతులు ఉన్నాయా లేదా అన్నది అధికారులు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నట్లయితే వాటి వివరాలను బహిర్గతం చేయాలని, అనుమతులు లేకపోతే వెంటనే పనులను నిలిపివేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందా? అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు, పన్నులు, ఇతర రుసుముల రూపంలో ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, నిర్మాణానికి సంబంధించిన అనుమతులను పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటారా? లేక నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూస్తారా? అనేది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

రంగారెడ్డి

తుక్కుగూడలో నర్స్ అనుమానాస్పద మృతి

తుక్కుగూడలో నర్స్ అనుమానాస్పద మృతి ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో విషాద ఘటన.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తుక్కుగూడ: తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తున్న శిరీష అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. ఆసుపత్రిలో నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న శిరీష మృతి చెందడంతో ఆసుపత్రి సిబ్బంది, స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. శిరీష మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం మృతికి అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. శిరీష మృతి వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే మృతి వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

రంగారెడ్డి

పెరుమాండ్ల ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

పెరుమాండ్ల ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు.. ఆలయంలో మార్మోగిన హనుమాన్ చాలీసా యాచారం, ఆగస్టు 29: యాచారం మండలం మేడిపల్లి, కడ్తాల్ మండలం పల్లెచెల్కతండ గ్రామాల సరిహద్దులో కొలువుదీరిన పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తూ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, నైవేద్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త, పల్లెచెల్కతండ మాజీ ఉపసర్పంచ్ సీతారాం నాయక్, బావోజి నారియా నాయక్ తదితరులు కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోనే నైవేద్యాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. శని, మంగళవారాలు ప్రత్యేక పూజలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ సాంప్రదాయం ప్రకారం మంగళవారం, శనివారం రోజులు ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భక్తులు విశ్వసిస్తారని తెలిపారు. ఈ రోజుల్లో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత, ధైర్యం కలుగుతాయని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం భక్తుల ఆచారంలో ప్రత్యేకమైనదని తెలిపారు. స్వామివారికి సింధూరాన్ని సమర్పించడం వల్ల గ్రహదోషాలు, ముఖ్యంగా శని సంబంధిత ఇబ్బందులు తొలగుతాయని భక్తుల విశ్వాసమని వివరించారు. హనుమాన్ చాలీసా పారాయణంతో ధైర్యం ప్రతిరోజూ లేదా మంగళ, శనివారాల్లో 11, 21 లేదా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా భయాలు తొలగి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారని తెలిపారు. అదేవిధంగా రామాయణంలోని సుందరకాండ పారాయణం చేయడం ద్వారా ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొని, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయని పేర్కొన్నారు. నైవేద్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఆంజనేయ స్వామికి వడపప్పు, పానకం, చలిమిడి, బూందీ లడ్డు, అరటిపండ్లు, మల్లెపూలు సమర్పించడం శ్రేష్ఠమని తెలిపారు. భక్తులు తమ శక్తి మేరకు స్వామివారిని పూజించి నైవేద్యాలు సమర్పించి ఆశీస్సులు పొందాలని కోరారు. పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం, ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కునిరెడ్డి నర్సింహారెడ్డి, చెందుపట్ల దేవేందర్‌రెడ్డి, మోటె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

అనుమతులు లేకుండానే షెడ్లు, నిర్మాణాలు.. టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై విమర్శలు

తుర్కయంజాల్‌లో అక్రమ నిర్మాణాల జోరు! అనుమతులు లేకుండానే షెడ్లు, నిర్మాణాలు.. టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై విమర్శలు ఆదిభట్ల, ఆగస్టు 29: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్, ఆదిభట్ల డివిజన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా, అవసరమైన అనుమతులు తీసుకోకుండానే కొన్ని ప్రాంతాల్లో షెడ్లు, వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు కాగితాలకే పరిమితమా? పట్టణ ప్రాంతాల్లో ఏ నిర్మాణమైనా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందిన తర్వాతే చేపట్టాల్సి ఉంటుంది. అయితే తుర్కయంజాల్, ఆదిభట్ల పరిధిలో కొన్ని నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత కూడా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. షెడ్ల నిర్మాణాలపై ఫిర్యాదులు ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, ఖాళీ స్థలాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా షెడ్లు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల నిర్మాణ సామగ్రిని రోడ్లపై ఉంచడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అనుమతులు, భవన నిర్మాణ నిబంధనలు, సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ తదితర అంశాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. అధికారుల తనిఖీలు ఎక్కడ? అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎంతవరకు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిర్మాణాలు పూర్తయ్యే వరకు వేచి చూసి ఆ తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రారంభ దశలోనే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లా.. అధికారుల నిర్లక్ష్యమా? కొన్ని అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి రాజకీయ ఒత్తిళ్లు కారణమా? లేక అధికారుల నిర్లక్ష్యమా? అనే చర్చ స్థానికంగా జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉన్నతాధికారులు స్పందించాలి తుర్కయంజాల్, ఆదిభట్ల డివిజన్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్రంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి, అనుమతులు ఉన్నాయా? నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై వస్తున్న ఆరోపణలపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితిని వెల్లడించాల్సి ఉంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.