గ్రీన్‌ఫీల్డ్ హైవే.. మరణ మార్గమా? ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. రహదారి నిర్మాణం పూర్తయిన కొద్ది నెలలకే పలుచోట్ల గుంతలు ఏర్పడి, నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన ఎగ్జిట్ పాయింట్లు లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైవేపై వాహనం మరమ్మతుకు గురై పక్కన నిలిపినా, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో ఈ రహదారి రైతులతో పాటు వాహనదారులకు కూడా శాపంగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ప్రమాద ప్రాంతాలను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై కూడా ఉండాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.


