Wednesday, 23 September 2026

Tag: Education

ప్రకాశం

DEO సామా సుబ్బారావును కలిసిన మార్కాపురం జిల్లా కౌన్సిలర్లు

DEO సామా సుబ్బారావును కలిసిన మార్కాపురం జిల్లా కౌన్సిలర్లు విద్యార్థుల మానసిక ఆరోగ్యం, కెరీర్ మార్గదర్శకత్వంపై చర్చ మార్కాపురం జిల్లా సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న జిల్లా కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) శ్రీ సామా సుబ్బారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ సేవలు, విద్యార్థులలో ఒత్తిడి తగ్గించడం, విద్యా ప్రగతిని మెరుగుపరచడం తదితర అంశాలపై చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సరైన మార్గదర్శకత్వం అందించడంలో కౌన్సిలర్ల పాత్ర ఎంతో కీలకమని, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవసరమైన కౌన్సెలింగ్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కృషి చేస్తామని కౌన్సిలర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా సమగ్ర శిక్ష పరిధిలోని జిల్లా కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

BHUPALPALLE

కడార్ల పూర్ణ చందర్‌కు అరుదైన గౌరవం ప్రతిష్టాత్మక ‘డాక్టరేట్’ మరియు ‘భారత్ గౌరవ్ రత్న సమ్మాన్’ పురస్కారాల ప్రదానం

సింగరేణి లో డిప్యూటీ మేనేజర్ గా Gdk-2&2A ఇంక్లైన్ లో విధులు నిర్వహిస్తున్న కడార్ల పూర్ణ చందర్‌కు అరుదైన గౌరవం ప్రతిష్టాత్మక ‘డాక్టరేట్’ మరియు ‘భారత్ గౌరవ్ రత్న సమ్మాన్’ పురస్కారాల ప్రదానం న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో డిప్యూటీ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ కడార్ల పూర్ణ చందర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గనుల భద్రత మరియు రెస్క్యూ ఆపరేషన్స్ (Mining Safety & Rescue Operations) విభాగంలో ఆయన చేసిన విశేష కృషికి మరియు అంకితభావానికి గాను ప్రతిష్టాత్మక ‘గౌరవ డాక్టరేట్’ తో పాటు ‘భారత్ గౌరవ్ రత్న సమ్మాన్’ పురస్కారాలు లభించాయి. సెప్టెంబర్ 19, 2026 న (శనివారం) న్యూఢిల్లీలోని నేషనల్ సైన్స్ సెంటర్‌లో అత్యంత ఘనంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాలను అందుకున్నారు. ప్రముఖ సంస్థ అయిన ‘వరల్డ్ కల్చర్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ కమిషన్’ (World Culture Environment Protection Commission) ఈ పురస్కారాలను ప్రదానం చేసింది. సెప్టెంబర్ 5, 2026 న ఈ అవార్డుల ఎంపికను కమిషన్ అధికారికంగా ప్రకటించింది. గనుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడంలో మరియు మైనింగ్ భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంలో శ్రీ కదర్ల పూర్ణ చందర్ కనబరిచిన ధైర్యసాహసాలు, నైపుణ్యాలకు గుర్తింపుగా ఈ అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయి. ఈ జాతీయ స్థాయి అవార్డులు అందుకోవడం పట్ల సింగరేణి అధికారులు, తోటి ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు మరియు ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీ పూర్ణ చందర్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

BHUPALPALLE

SGF భూపాలపల్లి మండల స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు*

భూపాలపల్లి:- ఈనెల 18,19 న SGF మండల స్థాయి ఆధ్వర్యంలో భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు బాలికల అండర్ 14 కబడ్డీ విభాగంలో ఏం.శ్రీనిహా, ఖో- ఖో విభాగంలో జి.సాత్విక , అండర్ 17 కబడ్డీ విభాగంలో జి.సాయి మనస్విని, ఖో – ఖో విభాగంలో షేక్ సన అలాగే బాలుర విభాగంలో అండర్ 14 కబడ్డీ విభాగంలో ఏ. సుశాంత్, ఏ. అశ్వత్, వాలీబాల్ విభాగంలో జి. విష్ణు అండర్ 17 ఖో – ఖో విభాగంలో పి. సాయి చరణ్ ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ రజనీకాంత్ తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ రెడ్డి గారు చరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులను ప్రోత్సహించిన గౌరవ తల్లిదండ్రులకు మరియు వారికి క్రీడల్లో మెలకువలు నేర్పించిన వ్యాయామ ఉపాధ్యాయులు సాంబరాజు మరియు శ్రీధర్ లకు స్థానిక ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడల పట్ల మరియు విద్య పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచుతూ ముందుకు కొనసాగుతామని అలాగే మండల స్థాయిలో కూడా విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా అన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

BHUPALPALLE

సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

భూపాలపల్లి, సెప్టెంబర్ 11: సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంలో నిర్వహించగా, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను నేర్పిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు సామాజిక న్యాయ వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ వేదిక ప్రతినిధులు, భాస్కర్ సీనియర్ ఉపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు, విద్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

BHUPALPALLE

ప్రత్యేక అవసరాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవగాహన సదస్సు విద్య, రక్షణ, సంరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన విద్యాశాఖ

భూపాలపల్లి: సమగ్ర శిక్ష తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సీఆర్‌పీలు, ఎంఐఎస్‌లు, సీఓలు, కార్యాలయ సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. శుక్రవారం ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారిణి శ్రీమతి ఎల్. లలిత అధ్యక్షత వహించగా, సీఏంఓ సామల రమేష్ సమన్వయంతో కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిణి మాట్లాడుతూ శారీరక, మానసిక, ఇంద్రియ లేదా అభ్యసన లోపాల వల్ల ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు సాధారణ పిల్లలతో పోలిస్తే ప్రత్యేకమైన రక్షణ, విద్య, సంరక్షణ అవసరమవుతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి, వారికి తగిన విద్యా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రిసోర్స్ పర్సన్లు వివిధ రకాల వైకల్యాలు, వాటి లక్షణాలు, విద్యార్థులు ఎదుర్కొనే అభ్యసన, కమ్యూనికేషన్, సామాజిక ఇబ్బందులపై అవగాహన కల్పించారు. దృష్టి లోపం, శ్రవణ లోపం, వాక్ మరియు భాషా లోపం, చలన వైకల్యం, మేధో వైకల్యం, అభ్యసన వైకల్యం తదితర అంశాలను వివరించారు. అలాగే, ప్రభుత్వము అమలు చేస్తున్న ప్రత్యేక విద్య, సమగ్ర విద్య, సమ్మిళిత విద్య విధానాల గురించి తెలియజేశారు. ప్రత్యేక అవసరాలుగల విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ చట్టాలు, పథకాలు, విద్యా మరియు ఉపాధి అవకాశాలపై కూడా అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్, విద్యలో 5 శాతం రిజర్వేషన్ తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీఏంఓ సామల రమేష్, ఏఎంఓ పింగిళి విజయపాల్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, మండల విద్యాశాఖ అధికారి అజ్మీర దేవా, జిల్లాలోని సీఆర్‌పీలు, ఐఈఆర్‌పీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

BHUPALPALLE

ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్‌కు సన్మానం

భూపాలపల్లి: భూపాలపల్లి ఎక్సైజ్ సీఐగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ను తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం పూల బొకేను అందజేసి నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, భూపాలపల్లి ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మామిండ్ల శ్రీనివాస్ గౌడ్, కోటగిరి సతీష్ గౌడ్, నేరేడుపల్లి సర్పంచ్ శ్రీపతి తిరుపతి గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ తాళ్లపల్లి సురేందర్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, తాళ్లపల్లి సదానందం గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, శ్రీపతి అశోక్ గౌడ్, ముత్యాల రోషన్ గౌడ్, బత్తిని సాయి గౌడ్, రామకృష్ణ గౌడ్, బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

BHUPALPALLE

బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు వినాయక చవితి వేడుకలు

భూపాలపల్లి: బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో ముందస్తు వినాయక చవితి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహభరితంగా నిర్వహించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించి, విద్యార్థులు సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేసి, పుష్పాలు, పత్రాలతో అలంకరించారు. గణపతి పూజ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, విద్యార్థులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. విద్యార్థులు వినాయక చవితి పండుగ విశిష్టత, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత పై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నివారించడం, సహజ రంగులు మరియు పూలతో పూజా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రిన్సిపాల్ రజినీకాంత్ మాట్లాడుతూ, “పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు, ఐక్యత, భక్తి, పర్యావరణ బాధ్యత వంటి విలువలను పెంపొందిస్తాయి” అని తెలిపారు. వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సందేశంతో నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.

BHUPALPALLE

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు

భూపాలపల్లి:- ఈనెల 09-09-2026 బుధవారం రోజున అంబేద్కర్ స్టేడియంలో *భూపాలపల్లి జిల్లా కబడ్డీ అసోసియేషన్* ఆధ్వర్యం లో నిర్వహించిన కబడ్డీ జూనియర్ బాలికల విభాగం లో గోనె సాయి మనస్విని(10వ తరగతి), సబ్ జూనియర్ బాలికల విభాగం లో గుగులోత్ వైష్ణవి(10వ తరగతి) మరియు బాలుర విభాగం లో బానోత్ సుశాంత్ (9వతరగతి) ఎంపిక కావడం జరిగింది.ఇట్టి పోటీలలో ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 26-09-2026 నుంచి 29-09-2026 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా లోని వేములవాడలో నిర్వహించబోయే 36 సబ్ జూనియర్ & 52వ జూనియర్ బాలుర & బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలల లో పాల్గొనడం జరుగుతుందని స్థానిక ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ రజినీకాంత్ గారు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు. అలాగే ప్రిన్సిపాల్ రజనీకాంత్ గారు మాట్లాడుతూ వీరిని ప్రోత్సహించిన గౌరవ తల్లిదండ్రులకు మరియు వ్యాయామ ఉపాధ్యాయుడైన సాంబరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.

BHUPALPALLE

బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ (బిట్స్) పాఠశాల భూపాలపల్లి లో నేత్ర అవయవ శరీర దాన అవగాహన కార్యక్రమం.

భూపాలపల్లి, సెప్టెంబర్ 7, 2026: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ (బిట్స్) పాఠశాలలో సోమవారం నేత్ర అవయవ శరీర దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని నేత్ర అవయవదాన ప్రాముఖ్యతపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని శ్రద్ధగా విని, నేత్ర అవయవదానం వల్ల కలిగే ప్రయోజనాలను తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసి, వారిని నేత్ర అవయవదానానికి ప్రోత్సహిస్తామని తెలిపారు. అసోసియేషన్ చైర్మన్ దేవనూరి చంద్రమౌళి గారు మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే సెల్‌ఫోన్ వినియోగాన్ని నియంత్రించుకోవాలని, అధికంగా సెల్‌ఫోన్ ఉపయోగించడం వల్ల కళ్లపై ప్రతికూల ప్రభావం పడి కంటి చూపు ను కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి చదువుపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. అదే సమయంలో నేత్ర అవయవ శరీర దానం ద్వారా అంధులకు చూపును అందించే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ నేత్ర అవయవ శరీర దానంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ (బిట్స్) పాఠశాల ప్రిన్సిపల్ రజనీకాంత్ గారు మాట్లాడుతూ, విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టు ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా బయాలజీ మరియు సైన్స్ విద్యార్థులకు నేత్ర అవయవదానం, కాడవర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రత్యేకంగా బయాలజీ టీచర్ ద్వారా తరగతి గదిలో ఈ విషయం పైన పూర్తి అవగాహన కల్పిస్తామని అన్నారు. భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బందెల భూమయ్య గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి గారు, జనరల్ సెక్రటరీ డాక్టర్ జె.సి. రాజు గారు, ఉపాధ్యక్షులు బుర్ర రాజన్న గారు, ఉపాధ్యాయులు చాంద్ పాషా గారు, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. “నేత్రదానం – మరొకరికి చూపు, ఒక కుటుంబానికి ఆశ” అనే సందేశంతో విద్యార్థుల్లో నేత్ర అవయవ శరీర దానంపై అవగాహన కల్పించారు.

ప్రకాశం

కెరీర్ ఎంపికలో విద్యార్థులు చేస్తున్న ప్రధాన తప్పులు

కెరీర్ ఎంపికలో విద్యార్థులు చేస్తున్న ప్రధాన తప్పులు సరైన నిర్ణయం భవిష్యత్తుకు బలమైన పునాది డా. కె.టి.సి. పాపారాయుడు Psychologist & District Career Mental Health Counsellor విద్యార్థి జీవితంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి దశలు ఎంతో కీలకమైనవి. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత ఏ రంగాన్ని ఎంచుకోవాలి? ఏ కోర్సులో చేరాలి? భవిష్యత్తులో ఏ ఉద్యోగం చేయాలి? అనే ప్రశ్నలు విద్యార్థులను మాత్రమే కాకుండా తల్లిదండ్రులను కూడా ఆలోచనలో పడేస్తుంటాయి. ఒకప్పుడు “డాక్టర్, ఇంజనీర్, టీచర్” వంటి కొన్ని పరిమిత కెరీర్ ఎంపికలే ఎక్కువగా కనిపించేవి. కానీ నేటి ప్రపంచంలో విద్యార్థులకు అనేక రకాల విద్యా, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవకాశాలు పెరిగిన కొద్దీ కెరీర్ ఎంపికలో గందరగోళం కూడా పెరుగుతోంది. కెరీర్ ఎంపిక అనేది కేవలం ఒక కోర్సును ఎంచుకోవడం కాదు. అది మన భవిష్యత్ జీవితానికి ఒక దిశను ఎంచుకోవడం. అందుకే ఈ నిర్ణయం తొందరపాటుతో కాకుండా, అవగాహనతో తీసుకోవాలి. అయితే చాలామంది విద్యార్థులు కెరీర్ ఎంపిక సమయంలో కొన్ని సాధారణ తప్పులు చేస్తున్నారు. వాటిలో మొదటిది ఇతరులను చూసి నిర్ణయం తీసుకోవడం. స్నేహితుడు ఒక కోర్సులో చేరితే తాను కూడా అదే కోర్సులో చేరాలని అనుకోవడం, బంధువుల పిల్లలు ఒక రంగంలో విజయం సాధించారని అదే రంగాన్ని ఎంచుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ ప్రతి విద్యార్థి సామర్థ్యం, ఆసక్తి, వ్యక్తిత్వం, అభిరుచులు ఒకేలా ఉండవు. ఇతరులకు సరిపోయిన కెరీర్ మనకు కూడా సరిపోతుందని భావించడం సరైన నిర్ణయం కాదు. మరో ముఖ్యమైన అంశం తల్లిదండ్రుల ఒత్తిడి. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించడం సహజం. తమ అనుభవంతో వారు మంచి సలహా ఇవ్వవచ్చు. అయితే పిల్లల ఆసక్తి, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా “నువ్వు ఇదే చదవాలి”, “ఈ ఉద్యోగమే చేయాలి” అని ఒత్తిడి చేయడం వల్ల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పిల్లల కోసం నిర్ణయం తీసుకోవడం కంటే, పిల్లలు సరైన నిర్ణయం తీసుకునేలా వారికి మార్గనిర్దేశం చేయడం మరింత ప్రయోజనకరం. కెరీర్ ఎంపికలో మరో సాధారణ తప్పు జీతాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవడం. ఎక్కువ జీతం వస్తుందని ఒక కోర్సును ఎంచుకోవడం మాత్రమే సరైన కెరీర్ నిర్ణయం కాదు. ఆ పని పట్ల ఆసక్తి ఉందా? అవసరమైన నైపుణ్యాలు మనలో ఉన్నాయా? ఆ రంగంలో మనం దీర్ఘకాలం కొనసాగగలమా? ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు వెతకాలి. డబ్బు మాత్రమే కెరీర్ విజయానికి ప్రమాణం కాదు. అదేవిధంగా మార్కులను మాత్రమే ఆధారంగా చేసుకుని కెరీర్‌ను నిర్ణయించడం కూడా సరైన విధానం కాదు. మంచి మార్కులు విద్యార్థి కృషిని, విద్యా సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. కానీ ఒక విద్యార్థి ప్రతిభను మార్కులతో మాత్రమే కొలవలేం. కమ్యూనికేషన్, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక నైపుణ్యాలు, ఇతరులతో కలిసి పనిచేసే సామర్థ్యం వంటి అనేక అంశాలు భవిష్యత్ కెరీర్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక సోషల్ మీడియా ప్రభావం కూడా విద్యార్థుల కెరీర్ నిర్ణయాలపై కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఒక రంగంలో సాధించిన విజయాన్ని చూసి, ఆ విజయానికి దారితీసిన విద్య, శిక్షణ, కృషి, పోటీ వంటి విషయాలను తెలుసుకోకుండా అదే రంగాన్ని ఎంచుకోవడం మంచిది కాదు. సోషల్ మీడియాలో కనిపించేది విజయానికి సంబంధించిన ఒక భాగం మాత్రమే. కెరీర్ నిర్ణయం మాత్రం వాస్తవ సమాచారం ఆధారంగా ఉండాలి. కొంతమంది విద్యార్థులు తాము ఎంచుకోవాలనుకుంటున్న కోర్సు లేదా ఉద్యోగం గురించి పూర్తిగా సమాచారం సేకరించకుండానే నిర్ణయం తీసుకుంటారు. ఆ కోర్సుకు ఏ అర్హతలు అవసరం? ప్రవేశ పరీక్షలు ఉన్నాయా? ఎంతకాలం చదవాలి? చదువు పూర్తయిన తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఏ నైపుణ్యాలు అవసరం? భవిష్యత్తులో ఆ రంగంలో మార్పులు ఎలా ఉండవచ్చు? వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. అందుకే ప్రతి విద్యార్థి కెరీర్ ఎంపికకు ముందు “నాకు ఏం ఇష్టం?” “నేను ఏ పనిని బాగా చేయగలను?” “నా బలాలు ఏమిటి?” “నా లక్ష్యం ఏమిటి?” అనే ప్రశ్నలను తనను తాను అడగాలి. తన ఆసక్తి, సామర్థ్యం, వ్యక్తిత్వం, లక్ష్యాలను అర్థం చేసుకున్న తర్వాతే కెరీర్ అవకాశాలను పరిశీలించడం మంచిది. ఇక్కడ కెరీర్ కౌన్సెలింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కెరీర్ కౌన్సెలింగ్ అంటే విద్యార్థికి ఒక కోర్సు లేదా ఉద్యోగాన్ని బలవంతంగా సూచించడం కాదు. విద్యార్థి ఆసక్తులు, సామర్థ్యాలు, వ్యక్తిత్వ లక్షణాలు, విద్యా నేపథ్యం, లక్ష్యాలను అర్థం చేసుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించడానికి సహాయం చేయడం. సరైన సమయంలో సరైన సమాచారం లభిస్తే విద్యార్థి గందరగోళం నుంచి బయటపడి ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోగలడు. కెరీర్ ఎంపికలో మానసిక ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రుల అంచనాలు, ఇతరులతో పోలికలు, వైఫల్యం భయం, భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాలు విద్యార్థులపై ఒత్తిడిని పెంచవచ్చు. అందువల్ల కెరీర్ ప్లానింగ్‌తో పాటు ఒత్తిడిని నిర్వహించడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా అవసరం. తల్లిదండ్రులు పిల్లలను ఇతర పిల్లలతో పోల్చకుండా, వారి ప్రత్యేకతను గుర్తించాలి. “వాడు ఇంత మార్కులు తెచ్చాడు, నువ్వెందుకు తేలేదు?” అనే ప్రశ్న కంటే “నీకు ఏ రంగం అంటే ఇష్టం? నీకు ఏ విషయంలో సహాయం కావాలి?” అనే ప్రశ్న పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలతో మాట్లాడటం మాత్రమే కాదు, వారిని వినడం కూడా తల్లిదండ్రుల బాధ్యత. అలాగే విద్యార్థులు ఒక విషయం గుర్తుంచుకోవాలి—కెరీర్ ఎంపికలో మొదటి నిర్ణయమే జీవితాంతం మారని నిర్ణయం కాదు. కాలానుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ఉన్నత విద్య, శిక్షణ, అనుభవం ద్వారా కెరీర్‌లో మార్పులు చేసుకునే అవకాశాలు నేటి ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి కెరీర్ గురించి ఆలోచించేటప్పుడు భయపడటం కంటే, సరైన సమాచారాన్ని సేకరించి ఆలోచనాత్మకంగా ముందుకు సాగడం ముఖ్యం. చివరగా చెప్పాలంటే, ప్రతి విద్యార్థి ఒకే మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఒకరికి విజయాన్ని ఇచ్చిన మార్గం మరొకరికి కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని చెప్పలేం. తన ఆసక్తిని గుర్తించడం, తన సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం, సరైన సమాచారాన్ని సేకరించడం, నిపుణుల సలహా తీసుకోవడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం—ఇవే మంచి కెరీర్ నిర్ణయానికి పునాదులు. “ఇతరుల విజయాన్ని చూసి మన కెరీర్‌ను ఎంచుకోకండి. మన సామర్థ్యాన్ని గుర్తించి మన భవిష్యత్తును నిర్మించుకుందాం.” విద్యార్థి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే, అది కేవలం మంచి ఉద్యోగానికి మాత్రమే కాదు—ఆత్మవిశ్వాసంతో, సంతృప్తితో కూడిన మంచి జీవితానికి కూడా మార్గం చూపుతుంది. డా!! కె టి సి పాపారాయుడు Psychologist & District & Career Mental Health Counsellor

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.