భూపాలపల్లి, సెప్టెంబర్ 7, 2026:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ (బిట్స్) పాఠశాలలో సోమవారం నేత్ర అవయవ శరీర దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని నేత్ర అవయవదాన ప్రాముఖ్యతపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని శ్రద్ధగా విని, నేత్ర అవయవదానం వల్ల కలిగే ప్రయోజనాలను తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసి, వారిని నేత్ర అవయవదానానికి ప్రోత్సహిస్తామని తెలిపారు.
అసోసియేషన్ చైర్మన్ దేవనూరి చంద్రమౌళి గారు మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే సెల్ఫోన్ వినియోగాన్ని నియంత్రించుకోవాలని, అధికంగా సెల్ఫోన్ ఉపయోగించడం వల్ల కళ్లపై ప్రతికూల ప్రభావం పడి కంటి చూపు ను కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించి చదువుపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. అదే సమయంలో నేత్ర అవయవ శరీర దానం ద్వారా అంధులకు చూపును అందించే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ నేత్ర అవయవ శరీర దానంపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ (బిట్స్) పాఠశాల ప్రిన్సిపల్ రజనీకాంత్ గారు మాట్లాడుతూ, విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టు ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా బయాలజీ మరియు సైన్స్ విద్యార్థులకు నేత్ర అవయవదానం, కాడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రత్యేకంగా బయాలజీ టీచర్ ద్వారా తరగతి గదిలో ఈ విషయం పైన పూర్తి అవగాహన కల్పిస్తామని అన్నారు. భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బందెల భూమయ్య గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి గారు, జనరల్ సెక్రటరీ డాక్టర్ జె.సి. రాజు గారు, ఉపాధ్యక్షులు బుర్ర రాజన్న గారు, ఉపాధ్యాయులు చాంద్ పాషా గారు, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
“నేత్రదానం – మరొకరికి చూపు, ఒక కుటుంబానికి ఆశ” అనే సందేశంతో విద్యార్థుల్లో నేత్ర అవయవ శరీర దానంపై అవగాహన కల్పించారు.


