భూపాలపల్లి: సమగ్ర శిక్ష తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సీఆర్పీలు, ఎంఐఎస్‌లు, సీఓలు, కార్యాలయ సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. శుక్రవారం ఎస్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారిణి శ్రీమతి ఎల్. లలిత అధ్యక్షత వహించగా, సీఏంఓ సామల రమేష్ సమన్వయంతో కార్యక్రమం కొనసాగింది.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిణి మాట్లాడుతూ శారీరక, మానసిక, ఇంద్రియ లేదా అభ్యసన లోపాల వల్ల ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు సాధారణ పిల్లలతో పోలిస్తే ప్రత్యేకమైన రక్షణ, విద్య, సంరక్షణ అవసరమవుతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి, వారికి తగిన విద్యా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
రిసోర్స్ పర్సన్లు వివిధ రకాల వైకల్యాలు, వాటి లక్షణాలు, విద్యార్థులు ఎదుర్కొనే అభ్యసన, కమ్యూనికేషన్, సామాజిక ఇబ్బందులపై అవగాహన కల్పించారు. దృష్టి లోపం, శ్రవణ లోపం, వాక్ మరియు భాషా లోపం, చలన వైకల్యం, మేధో వైకల్యం, అభ్యసన వైకల్యం తదితర అంశాలను వివరించారు. అలాగే, ప్రభుత్వము అమలు చేస్తున్న ప్రత్యేక విద్య, సమగ్ర విద్య, సమ్మిళిత విద్య విధానాల గురించి తెలియజేశారు.
ప్రత్యేక అవసరాలుగల విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ చట్టాలు, పథకాలు, విద్యా మరియు ఉపాధి అవకాశాలపై కూడా అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్, విద్యలో 5 శాతం రిజర్వేషన్ తదితర అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో సీఏంఓ సామల రమేష్, ఏఎంఓ పింగిళి విజయపాల్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, మండల విద్యాశాఖ అధికారి అజ్మీర దేవా, జిల్లాలోని సీఆర్పీలు, ఐఈఆర్పీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


