వీఆర్ఎ లకు 70 శాతం ప్రమోషన్లు కల్పించాలి 2008 నిబంధనల ప్రకారం వి.ఆర్.ఓ. పోస్ట్ లాలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్
దొరవారిసత్రం మండలం: గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ శాఖకు కీలకంగా సేవలందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) తమకు న్యాయబద్ధమైన పదోన్నతులు, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్థాయిలో రెవెన్యూ సంబంధిత విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వీఆర్ఏల నుంచి వీఆర్వో పోస్టులకు 70 శాతం వరకు పదోన్నతి అవకాశాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే అటెండర్. వాచ్మెన్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర కేటగిరీలకు కూడా తగిన ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న 20 శాతం ప్రమోషన్ అవకాశాలను 70 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2008 జీఓ ప్రకారం అవకాశాలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ వీఆర్వో సర్వీస్ రూల్స్-2008లో వీఆర్వో పోస్టుల భర్తీ, పదోన్నతులకు సంబంధించిన నిబంధనలు రూపొందించబడ్డాయి. 2008 లో జారీ చేసిన సవరణల్లో వీఆర్వో పోస్టుల్లో 70 శాతం ప్రత్యక్ష నియామకం, మిగిలిన 30 శాతం సంబంధిత కేటగిరీల నుంచి బదిలీ ద్వారా భర్తీ చేసే విధానం పేర్కొనబడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందికి వారి దీర్ఘకాలిక సేవలను పరిగణనలోకి తీసుకుని వీఆర్వో పోస్టుల్లో తగిన ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు డిమాండ్ వీఆర్ఏల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అర్హతలు, సర్వీస్, సీనియారిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా గుర్తించేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే 2008లో ప్రభుత్వం వీఆర్ఏల నుంచి వీఆర్వో గ్రేడ్-I పోస్టులకు నియామకానికి ఒకసారి ప్రత్యేకంగా నిబంధనల్లో సడలింపు ఇచ్చిన ఉదాహరణ ఉంది. వీఆర్ఏలను రెగ్యులర్ వీఆర్వోలుగా గుర్తించాలి గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ పనుల్లో సేవలందిస్తున్న వీఆర్ఏలను వారి సుదీర్ఘ సేవలను గుర్తించి రెగ్యులర్ వీఆర్వోలుగా గుర్తించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సేవా కాలం, అర్హతలు, సీనియారిటీ ఆధారంగా ప్రత్యేక ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించి, 2008 సర్వీస్ రూల్స్‌కు అనుగుణంగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు ప్రమోషన్ కోటాను పెంచి, అర్హులైన సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని వారు కోరుతున్నారు. వీఆర్ఏల దీర్ఘకాలిక సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు


