స్మార్ట్ రేషన్ కార్డులతో పౌరసేవలు మరింత పారదర్శకం
స్మార్ట్ రేషన్ కార్డులతో పౌరసేవలు మరింత పారదర్శకం బొంగ్లూర్‌లో రంగారెడ్డి జిల్లా స్థాయి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ బొంగ్లూర్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంతో పాటు, జవాబుదారీతనంతో పౌరసేవలు అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొచ్చామని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఐటీ, పురపాలకశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బొంగ్లూర్ గేటు సమీపంలోని ఫంక్షన్‌హాల్‌లో జిల్లా స్థాయి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా కార్డులు అందజేశారు. సాంకేతికతతో పౌరసేవలు: గత పదేళ్లలో రేషన్ కార్డుల జారీ సక్రమంగా జరగలేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. కొత్త కోడళ్లను, పుట్టిన పిల్లలను కార్డుల్లో చేర్చలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు, ఉచిత సన్నబియ్యం పంపిణీతో పాటు స్మార్ట్ కార్డుల ద్వారా ఆహార భద్రతను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కృషితో సుమారు 15 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, జిల్లాలో 90,276 కార్డుల ద్వారా 2.96 లక్షల మంది లబ్ధి పొందనున్నారని చెప్పారు. త్వరలో రేషన్ డీలర్ల నియామకాలు చేపడతామన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యం: అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వేగంగా, పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కీలక గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.


