Tuesday, 22 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

పొలం పిలుస్తుంది కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎమ్.ఆశా దేవి.

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఎలమంచిలి మండలం పులపర్తి గ్రామములో వ్యవసాయ శాఖ వారు నిర్వహించే పొలం పిలుస్తుంది కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎమ్ ఆశా దేవి పెంటకోట సూర్యారావు వరి పొలంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి జిల్లా వ్యాప్తంగా ఎల్ నినో ను దృష్టిలో పెట్టుకొని వర్షపాతం 50% తక్కువగా నమోదు కావడం చేతన వరి కి ప్రత్యామ్నాయంగా రాగులు, జొన్నలు, గంట్లు, జనుమ మరియు ఉలవలు తక్కువ నీటి వసతి గల పంటలను వేసుకోవాలని సూచించారు రైతులు తమ పంటలను సకాలంలో ధాన్యం అమ్మకాలు చేయాలన్నా ప్రభుత్వ పథకాలు కొనసాగాలన్న ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ,రైతులు నీటిపారుదల కింద ఉడుపులు జరిగినట్లయితే వెంటనే పసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఎలమంచిలి మండలంలో 130 మెట్రిక్ టన్నులు యూరియా 45 మెట్రిక్ టన్నులు డిఏపి అందుబాటులో ఉన్నదని కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలు మరియు సొసైటీ ద్వారా వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు తో పాటు వ్యవసాయ సహాయకులు హేమ పాల్గొన్నారు

అనకాపల్లి

ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్‌కుమార్ సుడిగాలి పర్యటన…!

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఎలమంచిలి: గౌరవ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్‌కుమార్ గారు ఈరోజు ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 25 వార్డుల్లో భారీ బైక్ ర్యాలీతో సుడిగాలి పర్యటన విజయవంతంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2:00 నుంచి 5:00 గంటల వరకు జరిగిన ఈ పర్యటనలో ఆయన నూతనంగా నిర్మించిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. అభివృద్ధి పనుల పరిశీలన: సుమారు రూ. 6.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు ఇతర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతూ “థాంక్యూ ఎమ్మెల్యే సార్” అంటూ నినాదాలు చేశారు. ప్రజల సమస్యలపై స్పందన: పర్యటన సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఎమ్మెల్యే గారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

అనకాపల్లి

పూడిమడకలో నూతన చేపల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విజయ్‌కుమార్..!

ఎలమంచిలి (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలోని మెయిన్‌ రోడ్డులో నూతన చేపల మార్కెట్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు. అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, ఎంపీడీవో తదితర శాఖల అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యే గారికి చూపించి, చేపల మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు… సుమారు రూ. కోటి అంచనా వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నూతన చేపల మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు ఎమ్మెల్యే గారికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ..మాట్లాడుతూ, చేపల వ్యాపారులు, మత్స్యకారులు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా మార్కెట్ నిర్మాణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని శాఖల సమన్వయంతో పనులు ముందుకు తీసుకెళ్లి, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నూతన చేపల మార్కెట్ నిర్మాణం పూర్తయితే పూడిమడకతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, చేపల వ్యాపారులకు ఆధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. చేపల విక్రయాలు మరింత పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా జరిగేందుకు అవకాశం కలగనుంది. అన్నారు… ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

గురజాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో సెమిస్టర్ 83.26% ఉత్తీర్ణత…!

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఎలమంచిలి: స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 2026లో నిర్వహించిన రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఏకంగా 83.26% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కోర్సుల వారీగా ఉత్తీర్ణత శాతం: బి.ఎ: 61.54% బీ.కాం: 72.31% బి.ఎస్సీ: 90.51% పరీక్షల నిర్వహణ అధికారి శ్రీ యం కిషోర్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. టాపర్ల వివరాలు: మొదటి స్థానం: జి నాగ సృజన (కంప్యూటర్ సైన్స్ – 9.37) రెండవ స్థానం: కే లావణ్య (కంప్యూటర్ సైన్స్ – 9.35) మూడవ స్థానం: ఎం. దుర్గ (బోటనీ – 8.93) ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ వి.ఏ. సత్యనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, ఐక్య కోఆర్డినేటర్ డాక్టర్ కే. వెంకన్న, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్రీ టి. అప్పారావు, వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడిలు పాల్గొన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఫలితాలను త్వరితగతిన విడుదల చేయడంలో సహకరించిన ఎగ్జామినేషన్ సెల్ సిబ్బంది పి. విశ్వేశ్వరరావు, కే. ధనలక్ష్మిలను ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది అభినందించారు

అనకాపల్లి

ఏటికొప్పాకలో హస్తకళాకారుల హబ్ పార్కు స్థల పరిశీలన..!!

ఎలమంచిలి : ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి నియోజకవర్గం పరిధిలోని ఏటికొప్పాక గ్రామంలో యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎమ్మార్వోతో పాటు సంబంధిత అధికారులతో కలిసి హస్తకళాకారుల కోసం ఏర్పాటు చేయనున్న హస్తకళాకారుల హబ్ పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఏటికొప్పాక కళాకారులకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. సంప్రదాయ హస్తకళలను పరిరక్షించడంతో పాటు కళాకారులకు మెరుగైన వసతులు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు హస్తకళాకారుల హబ్ పార్కు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హస్తకళాకారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్కు నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసి, అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏటికొప్పాక కళకు మరింత ప్రాచుర్యం తీసుకురావడంతో పాటు స్థానిక హస్తకళాకారులకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, హస్తకళాకారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఈ-పంటలో నమోదు చేసుకున్న రైతులకే పంట బీమా, నష్టపరిహారం!

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఏటికొప్పాక, ఆగస్టు 25: వరి సాగు చేసిన రైతులందరూ తప్పనిసరిగా ‘ఈ-పంట’లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మోహనరావు సూచించారు. రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రంలో తెలియజేస్తే, వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పొలాలను పరిశీలించి ఈ-పంట నమోదు చేస్తారని తెలిపారు. ఈ-పంటలో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా, పంట నష్టపరిహారం, ప్రభుత్వానికి ధాన్యం విక్రయం వంటి పలు ప్రభుత్వ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వరి పంటకు బీమా చేయించుకునేందుకు ఆగస్టు 31 చివరి తేదీ కావడంతో ఇప్పటివరకు బీమా చేయించుకోని రైతులు వెంటనే బీమా చేయించుకోవాలని సూచించారు. ఏటికొప్పాకలో ఈ-పంట నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ సిబ్బంది కుమార్ నిర్వహిస్తున్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో వైభవంగా శ్రీశ్రీశ్రీ ఇందేసమ్మ అమ్మవారి పండుగ మహోత్సవాలు…!

యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ | ఏటికొప్పాక గ్రామదేవత శ్రీశ్రీశ్రీ ఇందేసమ్మ అమ్మవారి పండుగ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామమంతా భక్తి వాతావరణంతో సందడిగా మారింది. ఇందేసమ్మ యూత్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో భక్తుల కోసం భారీ అన్నసమారాధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా యువత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా భారీ ముందుకుంటి సామానం, చిరతల కోలాటం వంటి సంప్రదాయ జానపద కార్యక్రమాలు నిర్వహించి భక్తులను అలరించారు. ఇందేసమ్మ యూత్ సభ్యులు మాట్లాడుతూ గ్రామదేవత ఇందేసమ్మ అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది అమ్మవారి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు గ్రామ ప్రజలు, పెద్దలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. అమ్మవారి పండుగను విజయవంతం చేయడంలో సహకరించిన గ్రామ పెద్దలు, యువత, భక్తులు, గ్రామ ప్రజలకు ఇందేసమ్మ యూత్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Uploaded Video:

అనకాపల్లి

ఎన్నికల షెడ్యూల్‌పై ఫేక్ ప్రచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

వాట్సాప్‌లో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరిక పున్నమి న్యూస్ | రిపోర్టర్: కె. ఆనంద్: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తేదీలు, ఎన్నికల షెడ్యూల్ పేరుతో వాట్సాప్‌, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ సమాచారం నకిలీదని, అనధికారికమని, వాస్తవం కాదని స్పష్టం చేసింది. కొంతమంది శాఖలు, సంస్థల పేర్లు, అధికారిక చిహ్నాలను అనుమతి లేకుండా ఉపయోగించి ఎన్నికల తేదీలు, షెడ్యూల్ పేరుతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో సమాచారం నిజమా కాదా అని తెలుసుకునేందుకు పలువురు ఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తున్నారని పేర్కొంది. ఇలాంటి ధృవీకరించని సమాచారాన్ని ప్రజలు నమ్మకూడదని, ఇతరులకు ఫార్వర్డ్ చేయకూడదని, సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఎన్నికల సంఘం సూచించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని సృష్టించి ప్రచారం చేసే వారిపై వర్తించే సైబర్ చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే ప్రెస్ నోట్ లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ప్రజలకు తెలియజేస్తామని స్పష్టం చేసింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు సోషల్ మీడియాలో వచ్చే ఎన్నికల షెడ్యూల్ సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలు, మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది.

అనకాపల్లి

పేరుకే మేజర్ పంచాయతీ.. ఏటికొప్పాక గ్రంథాలయానికి దిక్కెవరు?

ఏడు వేలకుపైగా ఓటర్లు.. భారీ జనాభా ఉన్నా గ్రంథాలయానికి కనీస నిర్వహణ కరువు.. లైబ్రేరియన్‌ ఉన్నారా? లేరా? అనే సందేహం! ఎలమంచిలి (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామం మేజర్ పంచాయతీగా, ఏడు వేలకుపైగా ఓటర్లతో ఉన్నప్పటికీ గ్రామంలోని గ్రంథాలయం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయం చుట్టూ తుప్పలు, పిచ్చిమొక్కలు పెరిగిపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. గ్రంథాలయాన్ని పర్యవేక్షించే లైబ్రేరియన్‌ ఉన్నారా? లేదా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. గ్రంథాలయం ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూసివేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు చెబుతున్నారు. పత్రికలు, కరెంట్‌ అఫైర్స్‌ మెటీరియల్‌, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచడం లేదని ఆరోపిస్తున్నారు. ఉన్న పుస్తకాలను కూడా సక్రమంగా భద్రపరచడం, నిర్వహించడం లేదని అంటున్నారు. మరోవైపు గ్రంథాలయ భవనం గోడలు పాడైపోయి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయాన్ని ఉపయోగించుకునేందుకు వచ్చే విద్యార్థులు, ప్రజలపై ఎప్పుడు ఏ గోడ భాగం పడిపోయి ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నామని చెబుతున్నారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత లైబ్రేరియన్/గ్రంథాలయ నిర్వాహకుడు, గ్రంథాలయ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, పరిసరాలను శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు. పుస్తకాలను క్రమబద్ధీకరించి, కొత్త పుస్తకాలు, దినపత్రికలు, పోటీ పరీక్షల మెటీరియల్‌ అందుబాటులో ఉంచి గ్రంథాలయాన్ని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మేజర్ పంచాయతీగా ఉన్న ఏటికొప్పాకలో విద్యార్థులు, యువతకు ఉపయోగపడాల్సిన గ్రంథాలయం ఇలాంటి దుస్థితిలో ఉండటంపై గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

అనకాపల్లి

ప్రకాశం పంతులు గారికి అనకాపల్లి జిల్లా పోలీసు వ్యవస్థ ఘన నివాళి..!

( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అనకాపల్లి జిల్లా పోలీసు వ్యవస్థ ఘన నివాళి అనకాపల్లి, ఆగస్టు 23: ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఆంధ్రకేసరి’ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి వేడుకలు అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో భావపూర్వకంగా నిర్వహించబడ్డాయి.​ అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్ గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ​ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్ మాట్లాడుతూ: ​మద్రాసులో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో, బ్రిటిష్ తుపాకీ ఎదుట గుండెను చూపి “కాల్చండి” అని గర్జించిన ప్రకాశం పంతులు ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచిపోయాయని, ఆ సాహసమే ఆయనకు ‘ఆంధ్రకేసరి’ బిరుదును తెచ్చిపెట్టిందని గుర్తుచేశారు.నిజాయితీ, సత్యనిష్ఠ, నైతిక విలువలతో కూడిన ఆయన జీవితం నేటి యువతకు, ప్రజాప్రతినిధులకు మరియు ఉద్యోగస్వామ్యానికి దిశానిర్దేశమని పేర్కొన్నారు.టంగుటూరి ప్రకాశం పంతులు గారు వేసిన బాటలో పయనిస్తూ, రాష్ట్ర మరియు దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ గారితో పాటు కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొని ఆంధ్రకేసరి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.