RDO కార్యాలయంలో వినతి పత్రం స్వీకరించని సిబ్బంది..!
ఫార్మా సిటీ రైతులపై వివక్ష చూపుతున్న అధికారుల తీరుపై ఆగ్రహం
పున్నమి న్యూస్ ప్రతినిధి
యాచారం, మే 23:
నానక్ నగర్ గ్రామంలో రెవెన్యూ సిబ్బంది, RDO అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, RDO పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు చల్ల లక్ష్మ రెడ్డి, చల్ల రామ్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఈ వినతి పత్రం కాపీని ఇబ్రహీంపట్నం RDO కార్యాలయంలోని ఇన్వార్డ్ సెక్షన్లో సమర్పించేందుకు వెళ్లగా, అక్కడి సిబ్బంది “ఫార్మా సిటీకి సంబంధించిన ఎలాంటి వినతి పత్రాలు తీసుకోవద్దని RDO ఆదేశాలు ఇచ్చారు” అంటూ పత్రం స్వీకరించేందుకు నిరాకరించినట్లు రైతులు తెలిపారు.
ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోరగా, “మేము అలా చేయము” అని సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ప్రజల వినతి పత్రాలు, ఫిర్యాదులు తప్పనిసరిగా స్వీకరించాల్సి ఉంటుందని రైతులు గుర్తుచేశారు.
అయితే ఇబ్రహీంపట్నం RDO కార్యాలయంలో మాత్రం ఫార్మా సిటీ రైతుల విషయంలో ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శించారు. “ఇదే ప్రజా పాలననా..? ఇదే రాజ్యాంగ రక్షణనా..?” అంటూ ఫార్మా సిటీ వ్యతిరేక కమిటీ ప్రశ్నించింది.
ఇట్లు:
ఫార్మా సిటీ వ్యతిరేక కమిటీ


