Friday, 10 July 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ:

ఆత్మకూరులో టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ నెల్లూరు ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) ఆత్మకూరు పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారెడ్డి గారి సూచనలతో జరిగింది. వేడుకలు బిఎస్సార్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీతో ప్రారంభమయ్యాయి. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దావా పెంచలరావు గారు మాట్లాడుతూ, “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతజాతికి ప్రతినిధి. ఆయనను కేవలం ఒక కులం, ప్రాంతం, వర్గానికి పరిమితం చేయడం సబబు కాదు. ఆయన సాంఘిక దురాచారాలను అధిగమించి, సమానత్వం కోసం పోరాడారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి” అని అన్నారు. అంబేద్కర్ విద్యకు ప్రాధాన్యతనిచ్చిన మహానేత అని, చదువు ద్వారానే మనిషి ఎదుగుదల సాధ్యమని నమ్మారని తెలిపారు. విధానపరమైన అన్యాయాలను ప్రశ్నించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఇంపాక్ట్” సంస్థ ఆధ్వర్యంలో ఉచిత Train The Trainer వర్క్‌షాప్

  హైదరాబాద్, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారి నేతృత్వంలో “ఇంపాక్ట్” సంస్థ ద్వారా ఉచితంగా నిర్వహించబడుతున్న Train The Trainer వర్క్‌షాప్‌ ఏప్రిల్ 15న ప్రారంభమవుతోంది. వ్యక్తిత్వ వికాసం, భయాల నివారణ, కెరీర్ అభివృద్ధి వంటి అంశాలపై ట్రైనింగ్ ఇవ్వబడనున్న ఈ వర్క్‌షాప్ యువతకు జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని అందించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారిని వెంటనే రిజిస్టర్ అవ్వాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. “మీ భయాలను మీ బలంగా మార్చుకునే సమయం ఇది” అనే నినాదంతో ప్రారంభమవుతున్న ఈ శిక్షణ శిబిరానికి సీట్లు పరిమితంగా ఉన్నాయి. విశేష సమాచారం కోసం ఈ క్రింది నంబర్లకు సంప్రదించవచ్చు: సంతోష్ కుమార్ – 98491 87544 స్వాతి పబ్బా – 83742 89992 శ్రీనివాస్ పెరుమండ్ల – 93466 08326

Featured ఆంధ్రప్రదేశ్

గాజువాకలో అంబేద్కర్ జయంతి ఘనంగా: సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పార్థసారధి

  విశాఖపట్నం, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గాజువాకలోని స్వామి విద్యానికేతన్ హై స్కూల్ రోడ్, సాయిరాం నగర్లో స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పార్థసారధి గారు హాజరై, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా పౌర హక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు తుంపాల శ్రీరామ్ మూర్తి, అలాగే పెదగంట్యాడ మండల ప్రభుత్వ వైద్యశాల అధికారి మరియు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పీ. హేమలత గారు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు దేశ ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం అమోఘమని, ఆయన చూపిన మార్గంలో నడిచేలా యువత సమాజానికి దోహదం చేయాలని సూచించారు. అంబేద్కర్ బోధనలు సమాజ సమానత్వానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్, గైడ్స్ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని విద్యార్థుల్లో చైతన్యం నింపేలా నిర్వహించినందుకు హర్షం వ్యక్తమైంది.

Featured ఆంధ్రప్రదేశ్

పద్మశ్రీ పరంధామయ్యకు అమెరికా విశ్వవిద్యాలయం అవార్డు

పద్మశ్రీ పరంధామయ్యకు అమెరికా విశ్వవిద్యాలయం అవార్డు నెల్లూరు , ఏప్రిల్ (కల్చరల్   పున్నమి ప్రతినిధి) విశిష్ట కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత పరంధామయ్య గారిని అమెరికాలోని ది అమెరికన్ యూనివర్శిటీ (The American University, USA) వారు పెర్ఫార్మన్స్ అప్ప్రెసియేషన్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. కళారంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించడంపై తెలుగు సాంస్కృతిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పరంధామయ్య గారు పలువురు కళాకారులకు మార్గదర్శకుడిగా నిలిచిన వ్యక్తిత్వం, ఆయన ప్రదర్శనలు దేశ విదేశాలలో సంగీత ప్రియులను ఆకట్టుకున్న తీరు, బహుళ కళారూపాలపై గల ప్రావీణ్యం ఆయనకు ఈ పురస్కారం రావడానికి కారణమయ్యాయి. అమెరికాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రతినిధులు ఆయనకు ఈ గౌరవాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు, “పరంధామయ్య గారు భారతీయ సంప్రదాయ కళలకు సమకూరిన మూల్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన వారిలో ఒకరు. ఆయన కళాప్రతిభ, కృషి, నిబద్ధత మా విశ్వవిద్యాలయానికి ఆదర్శంగా నిలిచాయి,” అని పేర్కొన్నారు. పరంధామయ్య గారు ఈ గౌరవాన్ని తన కళ గురువులందరికీ, అభిమానులకీ అంకితమిస్తూ, “ఇది వ్యక్తిగత విజయం కాదని, మన సంస్కృతికి లభించిన గౌరవంగా భావిస్తున్నాను,” అన్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) స్వాతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా పీఆర్‌టీయూ (PRTU) కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ మహోన్నత నాయకుడిగా, రాజ్యాంగ రూపకర్తగా, సమాజ శ్రేయస్సుకు పాటుపడ్డ మహనీయునిగా అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సర్వశిక్షా అభియాన్ AMO శ్రీ సుదీర్‌బాబు హాజరై, అంబేద్కర్ చూపిన మార్గం ఇప్పటికీ సమాజానికి దిశానిర్దేశకమని అన్నారు. ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షించే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా PRTU ప్రధాన కార్యదర్శి నాటకం తిరుమలయ్య, ఉపాధ్యాయులు వెంకటరాజు, నాగేంద్రకుమార్, సురేష్, రంగారావు, భాస్కర్, సైమన్ కుమార్, నాగిరెడ్డి, ఆచారి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను అనుసరించి విద్యారంగం పటిష్టంగా ఉండాలనే సంకల్పంతో తమ పోరాటం కొనసాగిస్తామని నాటకం తిరుమలయ్య తెలిపారు.

Featured అనంతపురం

అనంతపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అనంతపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు అనంతపురం, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అనంతపురం నగరంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఎదుట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజా సమాఖ్య అధ్యక్షులు గోర్తి వెంకటస్వామి గారు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గోర్తి వెంకట్ మాట్లాడుతూ, ‘‘డాక్టర్ అంబేద్కర్ ఒక మహానేత మాత్రమే కాక, ప్రపంచం గర్వించదగిన మేధావి. భారతదేశానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించిన గొప్ప రాజనీతిజ్ఞుడు. 2004లో అమెరికా కోలంబియా యూనివర్శిటీ రూపొందించిన ప్రపంచ టాప్ 100 మేధావుల జాబితాలో అంబేద్కర్ ప్రథమ స్థానంలో నిలిచారు’’ అని గుర్తుచేశారు. ‘‘చదువుతో వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందనడానికి అంబేద్కర్ జీవితం గొప్ప ఉదాహరణ. సామాజిక సమానత్వానికి ఆయన పాటించిన మార్గం నేటి తరానికి మార్గదర్శకం. మహిళల హక్కుల పరిరక్షణలో, కార్మికుల సంక్షేమం కోసం ఆయన రాజ్యాంగంలో చేసిన మార్పులు యుగప్రభావం కలిగించాయి,’’ అని పేర్కొన్నారు. ‘‘విద్య, రాజకీయం, సమాజం, ఆర్థిక రంగం, న్యాయవ్యవస్థ ఇలా అన్నింటినీ స్పృశించిన మహోన్నత నాయకుడిగా అంబేద్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం,’’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్తూరు మెయిన్ స్కూల్ హెడ్‌మాస్టర్ గోర్తి వెంకటస్వామితో పాటు ఉపాధ్యాయులు కె.జె.పి. రామన్న, హెచ్. రామాంజనేయులు, ఏ.హెచ్. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఘనంగా నివాళి అర్పించిన అడిషనల్ ఎస్పీ సౌజన్య

  నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) భారత రాజ్యాంగ నిర్మాత, మహామహుడు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి చి. సౌజన్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘మన దేశంలో ప్రతి మతానికి ఓ పవిత్ర గ్రంథం ఉన్నట్టే, అన్ని వర్గాల ప్రజలు అనుసరించే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన శిల్పి ఆయనే. న్యాయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన అంబేద్కర్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా, ‘‘అంబేద్కర్ స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా, నిబద్ధతతో సేవలందించిన మహామానవుడు. ఆయన జీవితయాత్ర అనేక ఉద్యమాలకు పునాది వేసింది. రాజ్యాంగం ప్రతీ పౌరుడికి స్వేచ్ఛ, హక్కులు అందించే దిక్సూచి’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ శ్రీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీ చంద్రమోహన్, డీసీఆర్‌బీ సీఐ శ్రీ రామారావుతో పాటు ఇతర పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విజయవంతంగా ర్యాలీ ముగింపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు: జిల్లా ఇంచార్జ్ ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,IPS.

  *పటిష్ట బందోబస్త్ నడుము ప్రశాంతంగా ముగిసిన హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ-జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,IPS., *శోభయాత్ర AC సుబ్బారెడ్డి స్టేడియం నుండి RSR స్కూల్ వరకు నిర్వహణ.* *ఎప్పటికప్పుడు శోభయాత్ర కదలికలను కమాండ్ కంట్రోల్ నుండి CC కెమెరాల ద్వారా పరిశీలిస్తూ అధికారులకు తగిన సూచనలు జారీ.* *ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా శోభయాత్ర నిర్వహణ.* *మంచి సమన్వయంతో విజయవంతంగా బందోబస్త్ నిర్వహించిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని అభినంధించిన ఎస్పీ గారు.* నెల్లూరు పట్టణంలో ఆదివారం జరిగిన హనుమ భక్త శోభాయాత్ర బైక్ ర్యాలీ, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి KVR పెట్రోల్ బంక్ మీదగా RTC బస్టాండ్, గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ మీదగా స్టోన్‌ హౌస్‌పేటలోని ఆర్ఎస్ఆర్ (RSRM) పాఠశాల వరకు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా, ఉత్సాహంగా ముగిసింది. వేలాది మంది భక్తులు జై హనుమాన్ జై శ్రీరామ్ అని వినాదాలు చేస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ యాత్రలో పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్రను జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి సీసీ కెమెరాల ద్వారా జిల్లా ఇన్చార్జి ఎస్పీ గారు నిరంతరం పర్యవేక్షిస్తూ, శోభాయాత్ర సాఫీగా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాత్ర మార్గంలో ట్రాఫిక్‌ను మరియు ప్రజల కదలికలను, శోభయాత్ర జరుగుతున్న విధానం, వెళ్ళే మార్గం, చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ పోలీస్ అధికారులకు ఎప్పటికప్పుడు పలు సూచనలు తెలియజేశారు. పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకొని, సజావుగా కార్యక్రమం ముగియడానికి కృషి చేశామని, శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తుగా అన్ని భద్రతా ఏర్పాట్లను చేపట్టి, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల మానిటరింగ్, మొబైల్ పార్టీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది సహకారం, కృషి కారణంగానే విజయవంతంగా, ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా బందోబస్తు నిర్వహించగలిగామని ఇంచార్జ్ ఎస్పీ గారు తెలిపారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తి తో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు. ఎవరికి కేటాయించిన విధులను వారు అప్రమత్తంగా ఉంటూ సమర్ధవంతంగా నిర్వర్తించడం, వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సాఫీగా సాగేలా నిరంతరం పర్యవేక్షించి, బందోబస్తు విధులు నిర్వహించి, విజయవంతంగా ర్యాలీ ముగింపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు” తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.  

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాతీయ అవార్డు పొందిన కేతరాజు నరేంద్రకు అభినందనలు

నెల్లూరు జిల్లా, ధనలక్ష్మీపురంలో ఉన్న వీ.బి.ఆర్ పాఠశాలలో హిందీ పండిట్‌గా సేవలందిస్తున్న శ్రీ కేతరాజు నరేంద్ర కు గౌరవనీయమైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు లభించింది. గుంటూరులోని సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ను ఈరోజు, తేదీ: 13-04-2025 న నరేంద్ర గారికి అందజేశారు. హిందీ భాషాభివృద్ధి, విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించటం గర్వకారణం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో, హిందీ భాషపై వారి ఆసక్తిని పెంపొందించడంలో కేతరాజు నరేంద్ర గారి పాత్ర ప్రశంసనీయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీ.బి.ఆర్ పాఠశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, తోటి ఉపాధ్యాయులు, మిత్రులు మరియు కుటుంబ సభ్యులు నరేంద్ర గారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నరేంద్ర గారు మరిన్ని పురస్కారాలు అందాలని వారు ఆకాంక్షించారు. ఈ అవార్డు విద్యారంగానికి, హిందీ భాషాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి నిదర్శనం.

Featured జాతీయ అంతర్జాతీయ

ధీరవనిత సునీత విలియమ్స్ :యం.వి.చలపతి

  సునీత విలియమ్స్ శాస్త్రీయ ధీరవనిత. అంతరిక్షంలో చిక్కుకున్న మహిళ. భూమి మీద నుండి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 8 రోజులలో తిరిగి రావాల్సి ఉండగా అంతరిక్షంలోనే తొమ్మిది నెలల పాటు చిక్కుకొని ధైర్యంగా తాను చేయవలసిన పరిశోధనలు చేసి, ఎట్టకేలకు భూమి మీదకు దిగారు. ఈమె విశ్వనారి .తండ్రి గుజరాతీ భారతీయ మూలాలున్న అమెరికన్ పౌరుడు. తల్లి మధ్య యూరప్ లోని స్లోవీనియా దేశ మూలాలు ఉన్న అమెరికన్ పౌరురాలు.  వీరి ముగ్గురు సంతానంలో చివరి వారు సునీత విలియమ్స్. ఈమె  భర్త మైఖేల్ జె విలియమ్స్ ,అమెరికన్ మార్షల్, హెలికాప్టర్ పైలెట్ . ఈమెకు మనము భావించే జాతీయత ఎల్లలు ఉన్నాయా ?ఎల్లలు లేని అంతర్జాతీయ మహిళ .అంతేకాదు అంతరిక్ష మహిళ కూడా.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి భూమి చుట్టూ 90 నిమిషాలకు ఒకసారి అంటే రోజుకి 16 సార్లు చొప్పున, ఇటీవలి 286 రోజులపాటు ఐఎస్ఎస్ లో ఉన్న కాలంలో 4576 పర్యాయాలు భూమి చుట్టూ ప్రదర్శనం చేశారు .అంటే 12 కోట్ల 10 లక్షల మైళ్ళ ప్రయాణం చేశారు. ఈమె 68 రోజుల 20 నిమిషాలు అంతరిక్షంలో గడిపింది రెండు పర్యాయాలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు కమాండర్ గా వ్యవహరించింది 62 గంటల 6 నిమిషాలు అంతరిక్ష కేంద్రం నుంచి వెలుపలకు వచ్చి స్పేస్ వాక్ చేసిన సాహసి.  నాలుగు  అంతరిక్ష ప్రయాణాలు చేశారు మూడు ముఖ్యమైన మిషన్లలో శాస్త్ర పరిశోధనలు చేశారు.     ఇలా అంతరిక్ష ప్రయాణాలు చేస్తూ, అంతరిక్షంలో ఉండి శాస్త్ర పరిశోధనలు చేయాలంటే విజ్ఞాన శాస్త్రంలో పట్టు ఉండాలి. విజ్ఞాన శాస్త్రం పట్ల అపారమైన నమ్మకం ఉండాలి .అలాగే సాంకేతిక నైపుణ్యం లో అపారమైన మెళుకువలుఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది .అంతేగాని కేవలం మొండి ధైర్యం కాదు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇచ్చిన ధైర్యం. అంతేకాదు మానవ శాస్త్రీయ కార్యాచరణ పైన  సునీత విలియమ్స్ కు బుచ్ విల్ మోర్లకు నమ్మకం ఉండబట్టే  వారు ఈ విషయంలో విజయం సాధించారు. సైన్స్ ని నమ్మి సైన్స్ పద్ధతిని ఆచరించి నవారు తప్పక విజయం సాధిస్తారు.అనే సందేశాన్ని సునీత విలియమ్స్ ఆమె సహ అంతరిక్ష నావికుడు ,పరిశోధకుడు అయినా బుచ్ విల్ మోర్ లు చాటిచెప్పారు. 2024లో బోయింగ్ స్టార్ లైనర్ లో వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు ఎనిమిది రోజులకే తిరిగి రావాల్సి ఉండగా సదరు స్టార్లైనర్ లో హీలియం వాయువు లీక్, ప్రొపల్షన్ సిస్టంలో లోపాలు తలెత్తాయి. ఫలితంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో వీరిద్దరూ మరో 9 మాసాలు అక్కడే ధైర్యంగా గడిపి పరిశోధనలు చేయవలసి వచ్చింది. సమస్యలు ఏర్పడ్డాయి .అవి సాదాసీదా సమస్యలు కాదు. జీవన్మరణ సమస్యలు. అంతరిక్ష నావికురాలు కల్పనా చావ్లా దుర్ఘటన కళ్ళ ముందు కదలాడుతున్నా, విజ్ఞాన శాస్త్ర సంకల్పబలం, ఆలంబనతో సశాస్త్రీయయ వైజ్ఞానిక ఆచరణతో పరిష్కరించగలం అని నమ్మి శాస్త్ర సమాజం కృషిచేసి వారిని భూమికి దింపగలిగింది.            సైన్స్ ను నమ్మి ,సైన్స్ పద్ధతిని త్రికరణ శుద్ధిగా ఆచరించి ,సాంకేతికంగా అభివృద్ధిని సాధించి  ,పరిశ్రమిస్తే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. అని మరోసారి రుజువైంది. ఇదే సశాస్త్రీయ మానవ వాదం.  మానవుడు నడక నుండి వాహనాల సాయంతో మొదట, నేల మీద ప్రయాణించే వాహనాలు, నీటి మీద ప్రయాణించే పడవలు ,నౌకలు తదనంతరం గాలిలో ప్రయాణించే విమానాలు, ఇప్పుడు అంతరిక్షంలో ప్రయాణించే రాకెట్లు, స్పేస్ షటిళ్ళు వచ్చేశాయి.  ఈ అంతరిక్ష వాహనాలతో ప్రయాణించి చంద్రుడు మీద కాలు మోపాడు మానవుడు. 2030 నాటికి అంగారకుడి మీద దిగాలని మానవుడుఉవ్విళ్లూరుతున్నాడు.చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహం అని అందరికీ తెలిసిందే. కానీ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగపెట్టుకుని మానవుడు కృత్రిమ ఉపగ్రహాలని భూకక్షలోకి ప్రవేశపెటుతున్నాడు.అవి భూమి చుట్టూ ప్రదక్షినం చేస్తూ మానవులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. కొన్ని కృత్రిమ ఉపగ్రహాలు సముద్ర పరిశోధన కోసం, మరి కొన్ని వాతావరణ పరిశోధన కోసం ,మరికొన్ని కమ్యూనికేషన్ సేవల కోసం, ఇంకొన్ని వ్యవసాయానికి మరికొన్ని విపత్తుల నుండి రక్షణ కొరకు, మరికొన్ని అయితే యుద్ధ రంగానికి ఉపయోగపడే దానికోసం కూడా కృత్రిమ ఉపగ్రహాలని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రృత్రిమ ఉపగ్రహాలని భూకక్షలో ప్రవేశపెట్టే దానికి రాకెట్లు స్పేస్ షటిళ్ళను వాహనాలుగా ఉపయోగిస్తారు.        ఇప్పుడు సునీత విలియమ్స్ మరి కొంతమంది అంతరిక్ష నావికులను అంతరిక్షంలోనికి ఈ రాకెట్లు ,స్పేస్ షటిళ్ళు తీసుకువెళుతున్నాయి. తిరిగితీసుకొని వస్తూన్నాయి. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల కోసం అంతరిక్ష పర్యాటక రంగాన్ని ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా ప్రారంభించాడు.   సునీత విలియమ్స్ విచ్ విల్ మోర్ మరో ఇద్దరు అంతరిక్ష ప్రయాణికులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమి మీదికి తీసుకొచ్చేదానికి ఎలాంటి స్పేస్ ఎక్స్ నాసాతో ఒప్పందం చేసుకొని ఫ్రూట్ డ్రాగన్ వాహక నౌక ద్వారా భూమి మీద తీసుకొచ్చారు.     సైన్స్ సాంకేతిక రంగాలను మానవులు మానవ కళ్యాణం కోసం అభివృద్ధి పరిచారు. అదే సైన్సును నేటి వ్యాపారులు తమ లాభార్జన కోసం వినియోగించుకుని కొటానుకోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకుంటున్నారు అంతేకాదు రాజకీయాలను కూడా శాసిస్తున్నారు.   సైన్స్ తనంత తానుగా మానవ కళ్యాణానికి ప్రస్తుత సామాజిక వ్యవస్థలోఉపయోగపడదు. దాన్ని ఉపయోగించే రాజ్య వ్యవస్థను బట్టి సైన్స్ మానవ వికాసానికా ?లేక వినాశానికా ? అనేది నిర్ణయించబడుతుంది. సైన్సు, సాంకేతిక రంగాలను మార్కెట్ లాభాపేక్ష కోసము కాక మానవాభివృద్ధి కోసం ఉపయోగించే రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత సమాజానికున్నది.    

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.