భద్రాద్రి కొత్తగూడెం:- 16/09/2026 పున్నమి ప్రతినిధి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై దురుద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తూ, ‘కల్పిత నాయకుడు’ పేరిట పుస్తకం రాసి వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్న హమారా ప్రసాద్ (నాగులారపు వరప్రసాద్) పై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
ఈ మేరకు కొత్తగూడెం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (SDPO) గారికి వినతిపత్రం సమర్పించారు. బహుజన, దళిత వర్గాల మనోభావాలను గాయపరుస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అతనిపై BNS మరియు SC/ST అట్రాసిటీ చట్టాల కింద తక్షణమే FIR నమోదు చేయాలని, ఆ వివాదాస్పద పుస్తకం విడుదలను శాశ్వతంగా నిషేధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో DHPS జిల్లా కార్యదర్శి సరిగంటి శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కరిష రత్నకుమారి, AIYF జిల్లా సహాయ కార్యదర్శి రవి కిరణ్, సర్పంచ్ కాశి, సాగర్, అఫీజ్ తదితరులు పాల్గొన్నారు.


