సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారులు 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని 120 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. అయితే బోనకల్లు, తల్లాడ, ఎన్కూరు మండలాల నుంచి ఒక్క ఉపాధ్యాయుడిని కూడా ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. తమ మండలాల్లో ఎంతోకాలంగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ, వివిధ విద్యా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ఎంపిక జాబితాలో తమ మండలాలకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై ఆయా మండలాల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో పారదర్శకతతో పాటు అన్ని మండలాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా అధికారులు పునఃపరిశీలించాలని వారు కోరుతున్నారు. తమ సేవలను కూడా గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



