పున్నమి: రంగారెడ్డి జిల్లా:
న్యాయవాది జి. అనిల్ కిరణ్ కుమార్ రచించిన “న్యాయవాద కమిషనర్లకు ఆచరణాత్మక మార్గదర్శిని” పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్ కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఘనంగా జరిగింది.
ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు వాకిటి రామకృష్ణారెడ్డి, జి.ఎం. మొహియుద్దీన్, మద్రాసు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి కె. సురేందర్, కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ అదనపు డీజీపీ, మాజీ సీబీఐ సంయుక్త సంచాలకులు వి. లక్ష్మీనారాయణ, తెలంగాణ న్యాయవాద మండలి అధ్యక్షులు ఎ. నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ, న్యాయవాద కమిషనర్ల పాత్ర న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. న్యాయవాద కమిషనర్ల విధులు, బాధ్యతలు, ఆచరణాత్మక అంశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించే ఈ పుస్తకం ముఖ్యంగా యువ న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
తెలుగు, ఇంగ్లీషు భాషల్లో న్యాయపరమైన అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమని పేర్కొంటూ రచయిత జి. అనిల్ కిరణ్ కుమార్ను వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ ప్రముఖులు, న్యాయవాద కమిషనర్లు, న్యాయ రంగానికి చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.





