నేల కొండపల్లి / ఖమ్మం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రౌడీ రాజ్యాన్ని నడుపుతోందని పాలేరు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ నున్నా రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా కార్యాలయం, నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.
నున్నా రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలదీస్తున్నామనే అక్కసుతోనే బీజేపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అధికార పార్టీ నేతల అండదండలతో గూండాలు స్వైరవిహారం చేస్తున్నారని అన్నారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, రామచంద్రరావుతో పాటు ఇతర నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యాలయాలకు భద్రత కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు కోటి హనుమంతరావు, జిల్లా కిసాన్ ముఖ్య కార్యదర్శి మీగడ గోపి, ముఠాపురం వార్డు సభ్యుడు కట్టా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.



