*పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రగతి ప్రణాళిక*
– 50 శాతం గ్రీన్ కవర్ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఏపీ గ్రీన్ (AP-GREEN)
– ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో గ్రీన్ కవర్ కార్యక్రమాల సమన్వయం
• రాష్ట్ర స్థాయి పాలక మండలి ఛైర్మన్ గా ఉప మఖ్యమంత్రివర్యులు
• ఏపీ గ్రీన్ ఛైర్మన్ అధ్యక్షతన కార్యనిర్వాహక కమిటీ విధులు
• జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కార్యక్రమాల సమన్వయం
• పచ్చదనం పెంపు, పర్యావరణ పునరుద్ధరణలో ప్రజా భాగస్వామ్య కార్యచరణ
• ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు గారి నాయకత్వంలో బాధ్యతాయుతమైన వ్యవస్థల నిర్మాణం
• మండల స్థాయి నుంచి మిషన్ మోడ్ కార్యాచరణకు ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రణాళికలు
• ప్రకృతి ఆధారిత జీవనోపాధి, గ్రామీణ ఉపాధి అవకాశాల సృష్టి
ప్రకృతి ఒడిలో రాష్ట్ర ప్రగతి ప్రయాణం సాగాలి. అది పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి. ఉన్న అడవులను కాపాడుకుంటూ, కొత్త అడవులను సృష్టించాలి. ప్రతి గ్రామాన్ని పచ్చదనపు ఛత్రం కిందకు చేర్చాలి. చెట్లను కాపాడుకుంటూ, ఆ చెట్ల నుంచి వచ్చే ఫలసాయం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించుకుంటూ, గ్రామాల్లో ప్రకృతి ఆధారిత జీవనోపాధి లక్ష్యాలు సాధించాలన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల నుంచి ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (AP-GREEN) రూపుదిద్దుకొంది. భవిష్యత్ తరాల కోసం పచ్చని, స్వచ్ఛమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు చేపడుతున్న 50 శాతం గ్రీన్ కవర్ కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడం కోసం AP-GREEN ఏర్పాటుకు అడుగులుపడ్డాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా విధులు నిర్వహిస్తూ, అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, పరిశ్రమలు, జలవనరులు, పట్టణ స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సీఎస్ఆర్ సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ముందుకు తీసుకువెళ్తుంది.
AP-GREEN ప్రధాన లక్ష్యం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు, పచ్చదనపు విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంపొందించడం. ప్రస్తుతం రాష్ట్ర భూభాగంలో 37.42 లక్షల హెక్టార్లలో నోటిఫైడ్ అటవీ ప్రాంతం ఉంది. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 22.96 శాతం. 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో భాగంగా భావి తరాలను వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి కాపాడేందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను నిరంతరాయంగా అమలు పరుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మ్ ఫారెస్ట్రీ, అగ్రో ఫారెస్ట్రీ, అవెన్యూ ప్లాంటేషన్లు, కాలువ గట్లు, షెల్టర్ బెల్ట్‌లు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో మొక్కల పెంపకాన్ని AP-GREEN సంస్థ ద్వారా చేపడతారు. ముఖ్యంగా పచ్చదనం క్షీణించిన భూములు, మైనింగ్ ప్రభావిత ప్రాంతాలు, బంజరు భూములు, ఇతర ఎకో సెన్సిటివ్ జోన్ల పునరుద్ధరణకు ఈ కార్యచరణలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మొత్తం కార్యక్రమాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోపాటు రైతులు, స్వయం సహాయక సంఘాలు, విద్యా సంస్థలను అనుసంధానిస్తూ, నాణ్యమైన మొక్కల ఉత్పత్తి, పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా నర్సరీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తారు.
గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలన్న భేదం లేకుండా 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, చెట్ల ఆధారిత జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సృష్టించడం, వాతావరణ మార్పులకు అనుగుణమైన జాతుల ఎంపిక, పెంపకం, తద్వారా శాస్త్రీయ పద్ధతులతో పర్యావరణ పునరుద్ధరణ చేపట్టడం అనే ప్రధాన లక్ష్యాలను AP-GREEN అత్యంత నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్తుంది. GIS, జియో-ట్యాగింగ్, డిజిటల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొక్కల పెంపకం, వాటి మనుగడకు భద్రత కల్పించడం, గ్రీన్ కవర్ పెరుగుదల కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది.
AP-GREEN కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నాబార్డ్, సీఎస్ఆర్ నిధులు, కార్బన్ ఫైనాన్స్, కార్బన్ క్రెడిట్లు, గ్రీన్ బాండ్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, ఎకో-టూరిజం వంటి వివిధ వనరుల ద్వారా నిధులను సమీకరించనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో- AP-GREEN ఛైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు గారి ఆధ్వర్యంలో నిధుల వినియోగం, పచ్చదనం పెంపొందించే అంశంలో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి, మిషన్ మోడ్‌లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. AP-GREEN సంస్థ గ్రీన్ కవర్ కార్యక్రమాల రాష్ట్ర స్థాయి సమన్వయం, పర్యవేక్షణ చేపడుతుంది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీలు (DGDAs), మండల స్థాయిలో MGICs ద్వారా కార్యక్రమాలు అమలు చేస్తారు. ప్రతి అడుగులో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నారు.
50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి 33 శాతం పచ్చదనం పెంపొందించాలని నిర్ణయించారు. అందుకోసం సమగ్ర ప్రణాళికను శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు. వచ్చే నాలుగేళ్లలో ఏడాదికి ఎన్ని హెక్టార్ల పరిధిలో పచ్చదనం పెంపొందించాలన్న దానిపై కార్యాచరణ సిద్ధం చేశారు. ఆరు నెలలు, మూడు నెలలు, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి విజన్‌కు అనుగుణంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 50 శాతం గ్రీన్ కవర్ సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ మహా యజ్ఞంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని AP-GREEN పరిపాలనా కార్యకలాపాలు మొదలవుతున్న వేళ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.
*మూడంచెల వ్యవస్థతో ఏపీ గ్రీన్ కార్యకలాపాలు*
ఏపీ గ్రీన్ మూడంచెల వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. రాష్ట్ర స్థాయి పాలక మండలికి రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చైర్మన్‌గా, ఏపీ గ్రీన్ ఛైర్పర్సన్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ, జలవనరులు, రోడ్లు-భవనాల శాఖల ప్రధాన కార్యదర్శులు, పీసీసీఎఫ్ డైరెక్టర్లుగా ఉంటారు. వీరితోపాటు ఏపీ గ్రీన్ సీఈఓ, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్, కార్పొరేట్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యా సంస్థ ప్రతినిధి, ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక అటవీకరణ రంగంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజానికి చెందిన ప్రతినిధులతో కలిపి మొత్తం 24 మంది పాలక మండలిలో భాగస్వాములుగా ఉంటారు.
రాష్ట్ర స్థాయి పాలక మండలి ఏటా రెండుసార్లు సమావేశమై విధానాల రూపకల్పన, ఏపీ గ్రీన్ కార్యకలాపాల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రెండో అంచెలో ఎగ్జిక్యూటివ్ కమిటీ కేబినెట్ హోదా కలిగిన ఏపీ గ్రీన్ ఛైర్పర్సన్ అధ్యక్షతన విధులు నిర్వహిస్తుంది. కమిషనర్ గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి సమన్వయ బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశమవుతుంది. జిల్లా స్థాయి గ్రీన్ డెవలప్మెంట్ అథారిటీ జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన పని చేస్తుంది. జిల్లా స్థాయి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయం, ఉద్యానవనం, పరిశ్రమలు, ఆర్ అండ్ బీ, దేవాదాయ, జలవనరులు, విద్యాశాఖల అధికారులు సభ్యులుగా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతలు చేపడతారు.


