విశాఖపట్నం, ఆగస్టు 26, 2026:
గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ సిహెచ్. వాసు నాయుడు గారి ఆదేశాల మేరకు గాజువాక పోలీస్ స్టేషన్ ఎస్సైలు ఎం. రమణ, కె. జగదీష్ గార్లు జింకు గ్రౌండ్ మైదానంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు, కుటుంబాలపై పడే ప్రభావం, యువత భవిష్యత్తుపై కలిగే దుష్ప్రభావాలను వివరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
మాదకద్రవ్యాలను విక్రయించడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం, వినియోగించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు.


