*అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ,*
*ఆరోగ్యంపై అవగాహన,*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 24 చిట్టమూరు మండలం,*
చిట్టమూరు: కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని జీఎంఎన్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు రెండో విడత జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండో రోజు జరిగిన శిక్షణలో చిన్నారుల ఆరోగ్యం, పోషణ, మెదడు అభివృద్ధి తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ మునికుమారి, భాస్కర్, వేణు పాల్గొని శిక్షణను నిర్వహించారు. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ అంశాలను అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు. ముఖ్యంగా చిన్నారుల జీవితంలో తొలి 1000 రోజులు అత్యంత కీలకమైనవని, ఈ కాలంలో మెదడు అభివృద్ధి గణనీయంగా జరుగుతుందని భాస్కర్ వివరించారు.
పిల్లలకు అవసరమైన పోషకాలు, పాలు, పెరుగు తదితర పోషకాహార పదార్థాల ప్రాధాన్యతను వివరించారు. తల్లి, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా పోషకాహార లోపాలను తగ్గించవచ్చని సూచించారు.
సీడీపీఓ మునికుమారి మాట్లాడుతూ వివిధ రుగ్మతలను గుర్తించడం, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చిన్నారులకు అందాల్సిన సేవలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా కల్పించే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్ఞాన జ్యోతి శిక్షణ ద్వారా చిన్నారుల ఆరోగ్యం, పోషణపై తమకు మరింత అవగాహన కలిగిందని కార్యకర్తలు తెలిపారు.



