🌏
తొట్లకొండ–రుషికొండ బీచ్లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం జిల్లా, ( పున్నమి ప్రతినిధి), ఆగస్టు 21:
విశాఖపట్నం వేదికగా రేపు, ఎల్లుండి జరగనున్న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల కీలక సమావేశాలకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిసి తొట్లకొండ, రుషికొండ బీచ్ ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.
అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సమావేశాలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వడం నగరానికి గర్వకారణంగా నిలవనుంది. అతిథుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, మౌలిక వసతులు, పర్యాటక ప్రాంతాల అందం తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
బ్రిక్స్ దేశాల యువత, క్రీడా రంగాల అభివృద్ధి, పరస్పర సహకారానికి వేదికగా నిలిచే ఈ సమావేశాలు విశాఖ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడింపజేయనున్నాయి.


